పరకాలను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల/గీసుగొండ :
పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి నియోజకవర్గంలోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాలలో పర్యటన చేసి పలు గ్రామాలలో అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. గీసుగొండ మండలంలోని గట్టుకిందిపల్లిలో అంగన్వాడి కేంద్రాకి ఎమ్మెల్యే రేవూరి, జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రామాణిక అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రాథమిక అవసరాలైన రోడ్లు తాగునీరు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్తు వంటి రంగాలలో వేగవంతమైన అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని పత్తి వ్యవసాయ క్షేత్రంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియాను పిచికారీ చేసిన విధానాన్ని ఎమ్మెల్యే రేవూరి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కష్టాన్ని తగ్గించుకోవాలని సూచించారు. డ్రోన్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేసుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేసుకోవచ్చని డ్రోన్ల ద్వారా పిచికారి చేయడం వలన పంట అంతటికి ఒకే విధంగా మందు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జడ్పీ సీఈఓ రామిరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ఇజ్జగిరి, డిఈ జ్ఞానేశ్వర్ ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పాలనతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ యూనిట్ ఎంతో ఉపయోగకరమని అన్నారు. గ్రామా ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని గ్రామా ప్రజలకు సూచించారు. అనంతరం చౌళ్లపల్లి, అగ్రంపహాడ్ గ్రామాల్లో నూతన అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, బిఆర్ఎస్ హయాంలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఆరు గ్యారంటీల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి నిర్మల, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటి తహసీల్దార్ భాస్కరమూర్తి, ఎంపిఓ విమల, ఏఈ బాబురావు, ఎపిఓ రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్, ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ బీరం సుధాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మాజీ జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, పిఏసియస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి, తదితరులు పాల్గొన్నారు


