పురాభివృద్ధే నా లక్ష్యం..!
ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం
క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం
కాకతీయ, రామకృష్ణాపూర్ :క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్మిక–మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 6, 10, 11, 15, 17, 18, 19, 20, 21 వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
మౌలిక వసతులపై దృష్టి
అనంతరం క్యాతన్‌పల్లి ఆర్‌ఓబీ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి పనులన్నీ నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, ఎర్రం సాగర్ రెడ్డి, పార్వతి విజయ, రామకృష్ణ, గోపు రాజాం, జంగం కళ, బాలకృష్ణ, కొక్కుల స్రవంతి సతీష్, రామ్ సాయి, శ్రీనివాస్, కిట్టు, మల్లయ్య, గొపతి రాజయ్య, పనాస రాజయ్య, పొలం సత్యం, వేల్పుల సత్యనారాయణ, రాజేష్, సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు


