నాన్న ప్రోత్సాహమే నడిపిస్తోంది : హర్షిత్ రాణా
కాకతీయ, తెలంగాణ బ్యూరో: టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతున్న హర్షిత్ రాణా.. తరుచూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గౌతమ్ గంభీర్‌కు ఫేవరేట్ ప్లేయర్ కావడంతోనే హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్లలో అవకాశాలు దక్కుతున్నాయనే అభిప్రాయం ఉంది. కానీ హర్షిత్ రాణా తన అద్భుత ప్రదర్శనతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లోనూ అతను మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఇప్పటి వరకు 13 వన్డేలు ఆడిన రాణా 23 వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతోనే అతనికి టీ20ల్లో కూడా అవకాశం దక్కింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టులోను చోటు లభించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న వైఫల్యాల గురించి మాట్లాడాడు. ప్రతీ రోజు తన తండ్రి ముందు ఏడ్చేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజులే తనకు వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాయని తెలిపాడు.
అప్పుడే తెలిసింది
‘వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. నా కెరీర్‌లో ఓ 10 ఏళ్ల పాటు నేను ఏం సాధించలేదు. నేను ట్రయల్స్ వెళ్లేవాడిని. కానీ నా పేరు వచ్చేది కాదు. తిరిగి ఇంటికి వచ్చి, ప్రతి రోజూ మా నాన్న ముందు కూర్చొని ఏడ్చేవాడిని. కాబట్టి ఇప్పుడు ఆ వైఫల్యం గడిచిపోయిందని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా.. దానిని తట్టుకోగలను. ఒకానొక సమయంలో నేను ఆశ వదలుకున్నాను. కానీ మా నాన్న నన్ను ప్రొత్సహించి ముందుకు నెట్టారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు నెట్స్‌లో బౌలింగ్ చేయడం ద్వారా నాలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు వచ్చింది. నేను వారికి మాములుగా బౌలింగ్ చేసినా సరే అక్కడ ఒక పోటీ వాతావరణం ఉంటుంది. వారు నన్ను సవాల్ చేస్తారు. దాంతో నేను అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్ చేస్తాను.’అని హర్షిత్ రాణా చెప్పుకొచ్చాడు.


