ఐపీఎల్–2026లో ముస్తఫిజుర్‌కు బ్రేక్
విడుదల చేయాలని కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశాలు
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
కేకేఆర్ బౌలింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
రూ.9.20 కోట్ల పెట్టుబడికి గండి
డెత్ ఓవర్ల బౌలింగ్‌కు ఏర్పడనున్న లోటు
కాకతీయ, క్రీడా ప్రతినిధి : భారత్–బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్–2026పై కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రహ్మాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ అధికారికంగా ఆదేశించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఇప్పటివరకు ‘వేచి చూద్దాం’ అన్న విధానాన్ని అనుసరించిన బీసీసీఐ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అంతర్గత అశాంతి, దాని ప్రభావంగా భారత్‌లో ఏర్పడిన రాజకీయ, ప్రజా ఒత్తిడులే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. క్రీడలు–రాజకీయాల మధ్య ఉన్న సున్నిత సంబంధాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపుతోందని క్రికెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ రూ.9.20 కోట్ల భారీ ధరకు ముస్తఫిజుర్‌ను కొనుగోలు చేయడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తఫిజుర్ రికార్డు నెలకొల్పాడు. అయితే తాజా పరిణామాలతో ఆ పెట్టుబడి ఇప్పుడు జట్టుకు భారంగా మారింది. ఈ విషయంపై దేవజిత్ సైకియా మాట్లాడుతూ “ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేకేఆర్ జట్టు నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రహ్మాన్‌ను విడుదల చేయాలని బీసీసీఐ సూచించింది. అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునేందుకు అనుమతి ఇస్తాం” అని స్పష్టం చేశారు.
కేకేఆర్ బౌలింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
ముస్తఫిజుర్ నిష్క్రమణ కేకేఆర్‌కు వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా అతడిపైనే జట్టు ప్రధానంగా ఆధారపడింది. ఎడెన్ గార్డెన్స్ మెల్లని పిచ్‌కు సరిపోయే అతడి కట్టర్లు, ఎడమచేతి పేస్ యాంగిల్‌ను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఇప్పుడు చివరి ఓవర్ల బాధ్యత మొత్తం మతీష పతిరానాపైనే పడనుంది. ముస్తఫిజుర్ లేకపోవడంతో కేకేఆర్ ఓవర్సీస్ కాంబినేషన్ పూర్తిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్, పతిరానా చుట్టూ రూపొందించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయి. హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్ వంటి భారత పేసర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావచ్చు. లేదంటే రాచిన్ రవీంద్ర లాంటి విదేశీ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఆర్థికంగా కూడా చిక్కులే
ఆర్థికంగా చూస్తే కేకేఆర్‌కు పరిస్థితి మరింత క్లిష్టం. ముస్తఫిజుర్ కోసం వెచ్చించిన రూ.9.20 కోట్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తిరిగి పర్స్‌లో జమ చేస్తేనే నాణ్యమైన ప్రత్యామ్నాయాన్ని దక్కించుకునే వీలుంటుంది. ఆ మొత్తంపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం కేకేఆర్ ఆందోళనను మరింత పెంచుతోంది. ఐపీఎల్–2026 ప్రారంభానికి ముందే ఈ పరిణామం లీగ్‌పై, ముఖ్యంగా కేకేఆర్ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపనుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


