చెత్త నిర్వహణపై అవగాహన ఉండాలి
ప్రజలకు జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి సూచన
తడి పొడి చెత్తను వేరుగా అందించాలని నగరవాసులకు సలహా
చెత్త సేకరణపై ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మేయర్ క్లాస్
కాకతీయ, వరంగల్ : ఇంట్లో చెత్త నిర్వహణపై అందరికీ అవగాహన అవసరమని వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. చెత్త నిర్వహణ విధానంపై మంగళవారం నిర్వహించిన ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి సిబ్బందికి, వలంటీర్లకు పలు సూచనలు చేశారు. చెత్త నిర్వహణపై ప్రతి డివిజన్ కు ముగ్గురు వలంటీర్లతో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని తెలిపారు. 4 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కు బదులు బయో డిగ్రేబుల్ సంచులు వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు కూరగాయల మార్కెట్, బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్లో నగరానికి 21 ర్యాంక్ వచ్చిందని, ఇండోర్ జైపూర్ లాంటి నగరాలతో పోటీ పడి ఉత్తమ ర్యాంక్ సాధించాలంటే ప్రజల సహకారం అవసరం అని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నాలంటీర్ లు నిబద్ధతతో పని చేయాలని, ప్రతి రోజు ఉదయం 7గంటల నుంచి పదింటి వరకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భగా వాలంటీర్లకు యూనిఫాంను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ డా. రాజేష్, టిఎంసి వెంకట్ రెడ్డి, సానిటరీ సూపర్ వైజర్ లు నరేందర్, గోల్కొండ శ్రీను, సానిటరీ ఇన్సెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.


