గడువులోపు పనులు పూర్తి చేయాలి
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, జగిత్యాల : ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మండల కేంద్రంలో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పెగడపల్లి మోడల్ స్కూల్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన నూతన వంటశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక కిచెన్ షెడ్లు పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి సామాన్యులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.


