రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్
కాకతీయ, కూసుమంచి : ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం తమ లక్ష్యమని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కూచిపూడి జగదీష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యమన్నారు.
భద్రతా నియమాలపై సూచనలు
హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను మానుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా తప్పిదాలు తగ్గుతాయని చెప్పారు. వేగం నియంత్రణ కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేసే వారిని ప్రభుత్వం రహవీర్గా గుర్తించి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు పాల్గొన్నారు.


