రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
ఎస్సై జీ. అపూర్వ రెడ్డి
కాకతీయ, చేర్యాల: ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చేర్యాల ఎస్సై జీ. అపూర్వ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని వాహనాదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి మాట్లాడుతూ. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. కార్లు నడిపించే వాహనదారులు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలను వాహనదారులకు క్లుప్తంగా వివరించారు. ఈ విషయాలను యువకులకు, విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని ఎస్సై సూచించారు. ప్రతి వాహనదారునికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, గుడ్ సమారిటన్కు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. అనంతరం వాహనదారులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.


