ఇన్సూరెన్స్ చేయించి హత్య
పాలసీ డబ్బులు కాజేసేందుకు పక్కా ప్లాన్‌తో మర్డర్
హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం
బతుకు కోరాల్సిన బావమరిదే అంతం చేశాడు
ఇన్సూరెన్స్ హత్యల ముఠాకు సహకరించిన భార్య
ఖమ్మం గాంధీనగర్ ఘటనలో నలుగురు అరెస్ట్.. పరారీలో భార్య
కారుతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం.. ఖమ్మం రూరల్ మండల పరిధిలో సంచలన ఘటన
కాకతీయ, కూసుమంచి : ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు దక్కించుకోవాలనే దురాశ ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంగా చూపించి తప్పించుకోవాలని వేసిన పక్కా పథకం చివరకు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పేరు మీద అతని బావమరిది దేశపోయిన శ్రీనివాస్ భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. సుమారు 66 లక్షల రూపాయల పాలసీ డబ్బులు దక్కించుకోవాలనే ఆశతో హత్యకు పక్కా పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల రెండో తేదీ రాత్రి సుమారు 8 గంటల 30 నిమిషాల సమయంలో రవిని మద్యం సేవిద్దామని చెప్పి దేశపోయిన శ్రీనివాస్ తన ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. వెంకటయ్యపాలెం శివారుకు తీసుకెళ్లి మద్యం మత్తులో ఉన్న రవిని అక్కడ దించి వెళ్లిపోయాడు.
కారుతో ఢీకొట్టి హత్య
ముందే పథకం ప్రకారం అక్కడికి వచ్చిన జోగి రాజ్‌కుమార్ మహేంద్ర ఎక్స్‌యువి కారుతో నడుచుకుంటూ వెళ్తున్న రవిని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా దేశపోయిన శ్రీనివాస్, జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు ఉన్నారు. మృతుడి భార్య చాగంటి ప్రశాంతి కూడా ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. హత్య అనంతరం ప్రమాదానికి గురైన కారును తనగంపాడు గ్రామంలోని ఓ ఇంట్లో కవర్లతో కప్పి దాచిపెట్టినట్లు విచారణలో తేలింది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన కారుతో పాటు నిందితుల సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలోనే ఈ క్లిష్టమైన హత్య కేసును ఛేదించిన ఖమ్మం రూరల్ పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


