మధ్యం తాగిపించి హత్య
వ్యక్తి గత కక్ష, భూ వివాదమే కారణం
పోలీసుల అదుపులో 6 గురు నిందితులు
వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ
కాకతీయ,కరీంనగర్ : కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ (40) హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు.
భూమి అమ్మకం కమీషన్ గొడవలు, వ్యక్తిగత విభేదాలు, బెదిరింపులు ఈ దారుణ హత్యకు కారణమయ్యాయని శుక్రవారం సిపి గౌష్ ఆలం మీడియా కు వివరాలు వెల్లడించారు.పథకం ప్రకారం దినేష్‌ను మద్యం పేరుతో బయటకు తీసుకువెళ్లి, దారుణంగా మట్టుబెట్టిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.దేవునూరి సతీష్, దినేష్ మధ్య భూవివాదాలు నెలకొని ఉండగా, మరో నిందితుడు దేవునూరి సంతోష్‌తో సన్నిహిత సంబంధాల విషయంలో దినేష్ పలుమార్లు బెదిరించడంతో కక్షలు పెరిగాయి. ఈ విషయాన్ని సంతోష్ తన అన్న శ్రావణ్‌కు చెప్పగా, ఇద్దరికీ దినేష్ వల్ల ముప్పు ఉందన్న భావనతో హత్యకు ప్రణాళిక పన్నాడు.ఫిబ్రవరి 25, 2024న శ్రావణ్ కుటుంబంలో జరిగిన మరణం కారణంగా అక్కడికి వచ్చిన దినేష్‌ను మద్యం పేరుతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం ఎర్టిగా కారును కిరాయికి తెచ్చి, మద్యం తాగించిన అనంతరం మల్కాపూర్ కెనాల్ వద్దకు దినేష్‌ను తీసుకొచ్చి నిందితులంతా కలిసి దారుణంగా దాడి చేశారు. తరువాత అతన్ని కారులో ఎక్కించుకొని నూకపల్లి శివారులో ఆపి తాడుతో మెడను బిగించి హత్య చేశారు. తాళ్లతో చేతులు, కాళ్లు కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు.ప్రధాన నిందితులైన దేవునూరి సతీష్, శ్రావణ్ గతంలో గంగాధరలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు చొప్పదండి సిబ్బంది మల్కాపూర్‌లో దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించగా, హత్యకు ఉపయోగించిన ఎర్టిగా కారు, యమహా బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.ఈ కేసును ఛేదించడంలో చొప్పదండి ఇన్స్పెక్టర్ ప్రదీప్‌కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఎస్సైలు నరేష్‌రెడ్డి, వంశీకృష్ణ, రాజు, సాంబమూర్తి సిబ్బంది ఓర్పుతో పని తీరును,సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.



