- 24 గంటల్లో నిందితుల అరెస్ట్
- రిమాండ్ కు తరలింపు
- వివరాలు వెల్లడించిన ఏసీపీ ఎం. రమేష్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జోన్ రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ డీఆర్‌డీఏ, టీజీఎస్ఇఆర్ఎఫ్ కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటల్లోనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ శనివారం మీడియాకు వెల్లడించారు. న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన హతుడు కోట చిరంజీవి (35) పోతనకాలనీలో మీ సేవా కేంద్రం నడుపుతున్నాడు. అతని భార్య 2019లో మృతిచెందడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఓ రోజు పని నిమిత్తం తన మీ సేవా కేంద్రానికి వచ్చిన పొలవెన సంధ్యారాణిని పరిచయం చేసుకున్నాడు.
అప్పటి నుండి ఆమెను ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా వేధిస్తూ, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తిరస్కరించిన ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఏసీపీ తెలిపారు. ఈ క్రమంలోనే చిరంజీవి చేష్టలపై నిందితురాలు సంధ్యారాణి ఆమె భర్త పొలవెన కుమార్‌కు తెలుపగా మృతుడు చిరంజీవి, కుమార్ ను కూడా ఫోన్ ద్వారా బెదిరించడం మొదలుపెట్టాడు. నెల క్రితం ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ చిరంజీవి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా సంధ్యారాణికి తనతో పెళ్లి జరిగిందని, ఇద్దరం కలిసి లేచిపోయామని చెడుగా ప్రచారం చేశాడు. కాగా ఈ నెల 10న మృతుడు, ఆమె పనిచేసే సెంటినరీ కాలనీ సమాఖ్య కార్యాలయం వద్దకు వచ్చి గొడవకు దిగాడంతో సంధ్యారాణి తన భర్త, అన్నయ్య, తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని తెలియపరిచింది.
అక్కడికి వచ్చిన మల్లయ్య, నరేష్, కుమార్, చందు చిరంజీవిపై దాడి చేశారు. అనంతరం మల్లయ్య ఇనుప రాడ్డుతో చిరంజీవి తలపై పొడువగా తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు కోట రాం చరణ్ ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితులు మోటార్ సైకిళ్లపై వెళుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెంచికల్ పేట్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు బైకులు, ఇనుప రాడ్డు, చాకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు.


