భూతల స్వర్గధామంగా ములుగు
ప్రకృతి అందాల పరవశం.. భక్తి–చరిత్రల సంగమం
ఎకో టూరిజానికి కొత్త ఊపిరి
పర్యాటకుల కేరాఫ్‌గా జిల్లాకు గుర్తింపు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, చారిత్రక వైభవం కలగలిసిన ములుగు జిల్లా పర్యాటకులను ఆకట్టుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. భక్తి, ఆనందం, ప్రకృతి అందాలు అన్నీ ఒకేచోట అనుభవించగల ప్రాంతంగా ములుగు భూతల స్వర్గధామంగా మారిందని ఆమె అభివర్ణించారు.
బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఏటూరు నాగారం వైల్డ్‌లైఫ్ పరిధిలోని తాడ్వాయి వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్ రేంజ్, తాడ్వాయి హాట్స్, రెండు సఫారీ వాహనాలను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సుమారు 7 కిలోమీటర్ల మేర అరణ్య ప్రాంతంలో సఫారీ నిర్వహించారు. హాట్స్ పరిసరాల్లోని అరుదైన వృక్షజాలం, వాటి ప్రాధాన్యతను అటవీ అధికారులు వివరించారు.
భక్తి కేంద్రాలే పర్యాటకానికి బలము
ములుగు జిల్లాకు వచ్చే భక్తులు ముందుగా ఆది దేవత ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉందని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోందని, రామప్ప సరస్సు మధ్య ద్వీపకల్ప అభివృద్ధి త్వరలో పూర్తవుతుందని తెలిపారు. లక్నవరం సరస్సు, అక్కడి కాటేజీలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధికి రూ.251 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌కు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాను సెలవు దినాల్లో తప్పకుండా సందర్శించి ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని ఆస్వాదించాలని మంత్రి సీతక్క పర్యాటకులను ఆహ్వానించారు. స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతి ములుగు ప్రత్యేకత అని ఆమె అన్నారు


