బీసీ హాస్టల్‌లో ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ
మామునూర్‌లో పూలే హాస్టల్‌ను పరిశీలన
కాకతీయ, వరంగల్ సిటీ : ఖిలావరంగల్ మండలం మామునూర్ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫైర్ హాస్టల్‌ను శనివారం సాయంత్రం మండల ఎమ్మార్వో మహమ్మద్ ఇక్బాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఏవైనా సమస్యలు ఉంటే తనకు వెంటనే తెలియజేయాలని సూచించారు. హాస్టల్‌లో అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా సంకోచం లేకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
వార్డెన్‌కు ఆదేశాలు
హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడిన ఎమ్మార్వో, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. వసతి, పరిశుభ్రత, భోజనం అంశాల్లో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తనిఖీ అనంతరం ఎమ్మార్వో మహమ్మద్ ఇక్బాల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకే హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


