కాకతీయ, వరంగల్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని, వేయి స్తంభాల ఆలయంలో దుర్గామాతను సోమవారం స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సమాజానికి శుభసూచక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు. వరంగల్ చారిత్రక ఆలయాలు, దేవాలయాలు మన సంస్కృతి వైభవానికి ప్రతీకలని తెలిపారు. దేవి కటాక్షంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వరంగల్ మహానగరం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యం కోసం ఆలయాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు తాను కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు .


