మొంథా.తుపాను ప్రభావం.
ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలు..
రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన వివరాల ప్రకారం ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం తాడ్వాయి మండలంలో నమోదైంది.
తాడ్వాయి మండలం కేంద్రంలో 13.0 మి.మీ, తాడువాయి హట్స్‌లో 11.8 మి.మీ, మేడారం వద్ద 7.3 మి.మీ వర్షపాతం నమోదైంది.గోవిందరావుపేట మండలం – 2.3 మి.మీ వర్షం కురిసింది.వెంకటాపురం మండలం – అలుబాక వద్ద 1.0 మి.మీ, వెంకటాపురం వద్ద 0.8 మి.మీ వర్షం పడింది.ములుగు, వాజేడ్ మండలాలు – తలా 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది.మంగపేట మండలం – 0.5 మి.మీ వర్షం కురిసింది.మొత్తం జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
కలెక్టర్ దివాకర అధికారులతో సమీక్ష…
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాను ప్రభావం వల్ల రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పంట కోతలను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఆరబెట్టిన ధాన్యాన్ని రక్షించేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో వర్షం వల్ల ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలనీ ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు తమ పరిధిలోని చెరువులు, కాలువలు, కాజ్‌వేలు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించాలని, శిథిల భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు….
వర్షాల కారణంగా అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-7109 వద్ద 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వర్షం, వరదలతో సంబంధిత సమస్యలు వచ్చిన వెంటనే ప్రజలు ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చని చెప్పారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన మందులు, బృందాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా నష్టం జరగలేదని, అయితే వచ్చే 48 గంటలు కీలకమని కలెక్టర్ తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బందీ రాదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.


