డబుల్ బెడ్రూమ్ పేరుతో డబ్బులు వసూలు చేశారు
కాంగ్రెస్కు అవకాశం ఇవ్వండి – కేకే మహేందర్ రెడ్డి
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినా 24వ వార్డు కనీస అభివృద్ధికి కూడా నోచుకోలేదని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి ఆడెపు వెంకటస్వామి తరఫున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇప్పటికీ సీసీ రోడ్లు, మురుగు కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరుతోందని, ఇదేనా పదేళ్ల అభివృద్ధి అని ప్రశ్నించారు. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కూడా సక్రమంగా లేదన్నారు. గత బీఆర్ఎస్ కౌన్సిలర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారని, సమస్యలు చెప్పేందుకు వెళ్లిన వారితో అహంకారంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ జోన్ సమస్య పరిష్కరించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ అందేలా పైపులైన్లు వేయిస్తామని, వార్డు అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈసారి అధికార కాంగ్రెస్కు ఓటేసి అభ్యర్థి ఆడెపు వెంకటస్వామిని గెలిపించాలని ప్రజలను కోరారు.


