డ్రగ్స్ కేసులో మనీ లింకులు
ఆర్థిక లావాదేవీలపై సిట్ ఫోకస్
బ్యాంకు ఖాతాల విశ్లేషణతో నెట్‌వర్క్ గుట్టువిప్పే ప్రయత్నం
నిందితుల మధ్య సంబంధాలపై లోతైన విచారణ
కాల్పుల ఘటన వెనుక అసలు ఉద్దేశ్యాలపై ఆరా
డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లో కీలక ఆధారాల సేకరణ
అభిషేక్ సింగ్ కోసం ప్రత్యేక బృందాల గాలింపు
కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు కీలకం
డీసీపీ యుగేష్ గౌతం, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు సమీక్ష
కాకతీయ,తెలంగాణ క్రైం బ్యూరో : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే అసలు నెట్‌వర్క్‌ను కనుగోనేందుకు సిట్‌దూకుడు పెంచుతోంది. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తే డ్రగ్స్ మూలాలు, సరఫరా మార్గాలు, సంబంధాల గొలుసు బయటపడుతుందని భావిస్తున్న పోలీసులు బ్యాంకు ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరి ఖాతాలోకి ఎంత మొత్తం వెళ్లింది? ఎవరితో ఎలాంటి లావాదేవీలు జరిగాయి? వాటి వెనుక ఉద్దేశం ఏమిటి అన్న దానిపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో ప్రతి ఆర్థిక లింక్ కీలకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. 11 మంది నిందితులు వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనా, వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నప్పటికీ, వారందరినీ కలిపే సామాన్య లింక్ ఏమిటన్నదానిపై సిట్ లోతుగా విచారణ చేపట్టింది. నిందితుల మధ్య స్నేహం ఎలా మొదలైంది? వ్యాపార సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? డ్రగ్స్ పార్టీల వరకు ఎలా చేరింది? అన్న అంశాలపై అధికారులు ప్రశ్నావళితో ముందుకు సాగుతున్నారు. మోయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో ప్రతి నిందితుడి పాత్రను విడివిడిగా విశ్లేషిస్తున్నారు.
కాల్పులు ఎందుకు జరిపారు..?
14వ తేదీ సాయంత్రం జరిగిన డ్రగ్స్ పార్టీ సమయంలో పోలీసుల ముందు తుపాకీ కాల్పులు జరగడం వెనుక అసలు కారణాలపై కూడా విచారణ కొనసాగుతోంది. రోహిత్ రెడ్డి, విదేశ్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిగాయా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా అన్నది తెలుసుకునేందుకు నిందితులను వేర్వేరు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. కాల్పుల ద్వారా ఏదైనా సాక్ష్యాలను ధ్వంసం చేయాలనుకున్నారా? లేక భయపెట్టడానికే ఆ చర్య తీసుకున్నారా అన్న అంశాలపై స్పష్టతకు రావడానికి సిట్ ప్రయత్నిస్తోంది. ఈ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ విక్రేత అభిషేక్ సింగ్ కోసం 4 ప్రత్యేక బృందాలతో సిట్ గాలింపు కొనసాగిస్తోంది. అతను దొరికితే రోహిత్ రెడ్డితో ఉన్న సంబంధం, గతంలో డ్రగ్స్ విక్రయాల చరిత్ర, మరెవరెవరికి సరఫరా జరిగిందన్న అంశాలపై కీలక సమాచారం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్ డేటా, సన్నిహితుల సమాచారం ఆధారంగా పలు ప్రాంతాల్లో శోధనలు ముమ్మరం చేశారు.
7గురు నిందితుల విచారణ
విచారణలో భాగంగా సంఘేశాబాద్ పోలీస్ స్టేషన్‌లో 7 మందిని ప్రశ్నించారు. అభిషేక్ సింగ్ గురించి సమాచారం ఇచ్చిన రోహిత్ రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు, చిలివేడిస్ సరథ్, అలాగే కోకైన్ సరఫరాలో అనుమానితుడిగా ఉన్న రవిశిక్ రవిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. వారి ఫోన్ కాల్ రికార్డులను విశ్లేషిస్తూ గతంలో జరిగిన సంభాషణలు, సంబంధాలను గుర్తిస్తున్నారు. నిందితులలో కొందరు గతంలో డ్రగ్స్ కేసుల్లో అనుమానితుల జాబితాలో ఉన్నారన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు.
కస్టడీతో కొత్త పేర్లు వెలుగులోకి?
ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్, విజయేశ్ రెడ్డి, నవీన్ శర్మల కస్టడీ పిటిషన్ నేడు విచారణకు రానుంది. కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే, మరింత లోతుగా విచారణ చేపట్టి కీలక వివరాలు రాబట్టే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల నుంచి లభించే సమాధానాల ఆధారంగా మరికొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హై ప్రొఫైల్ కేస్ కావడంతో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ సిట్ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోంది. శివల్లే డీసీపీ యుగేష్ గౌతం నిందితులను నేరుగా విచారిస్తుండగా, సిట్ పరివేక్షకుడు, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు అధికారులతో ప్రతిరోజూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దర్యాప్తు పురోగతిని తెలుసుకుంటున్నారు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తూ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు.


