మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్ధి వార్డులో ధన ప్రవాహం..
*ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రెండు జాతీయ పార్టీల పాకులాట…
*కౌన్సిలర్ అభ్యర్థులు పోటాపోటీగా పంపకాలు..
*ఓటుకు 3500/- నుండి 7000/- వరకు పంపిణీ…
*ఎలాగైనా గెలవాలని చైర్మన్ అభ్యర్థి…
*చైర్మన్ అభ్యర్ధిని ఓడించాలని ప్రతిపక్ష నాయకుడి తాపత్రయం..
కాకతీయ,పరకాల: మున్సిపాలిటీ ఎన్నికల వేళ చైర్మన్ అభ్యర్థి వార్డులో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా రెండు జాతీయ పార్టీల మధ్య తీవ్ర పాకులాట కొనసాగుతోంది. అధికార–ప్రతిపక్షాలకు చెందిన నాయకులు తమ అభ్యర్థులను గెలిపించేందుకు అన్ని మార్గాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చైర్మన్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా, గతంలో కౌన్సిలర్ గా పని చేసిన అనుభవంతో ప్రతి పక్ష అభ్యర్ధి పోటాపోటీగా పంపకాలకు దిగినట్లు సమాచారం. ఓటుకు రూ.3,500/- నుంచి రూ.7,000/- వరకు పంపిణీ జరుగుతోందన్న ప్రచారం వార్డంతా జోరుగా సాగుతోంది. డబ్బుతో పాటు ఇతర ప్రలోభాలకూ తెరలేపినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో చైర్మన్ అభ్యర్థి రంగంలోకి దిగగా, మరోవైపు ఆయన్ను ఓడించాలనే తాపత్రయంతో ప్రతిపక్ష నాయకుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వార్డులో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
ధన ప్రవాహం, ప్రలోభాల ఆరోపణల మధ్య ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.


