ఈస్ట్‌జోన్‌లో మోనార్క్
వరంగల్ పోలీస్‌శాఖకు మచ్చతెస్తున్న అధికారి
ఫిర్యాదుదారులపైనే బూతుల దండకం
పోరా.. రారా.. అరేయ్.. తరేయ్.. పోవే..రావే..
ఇదీ స్టేషన్‌లో ఫిర్యాదుదారులపై అధికారి వాడుక భాష
ఫిర్యాదుతో సంబంధం లేదు.. పలుకుబడిని బట్టి సెక్షన్లు.. కేసు ఫైల్
ఫిర్యాదు మార్చి రాయాలంటూ హుకూం
ఇదెక్కడి న్యాయమంటూ వాపోతున్న జనాలు
సార్ బదిలీకి వేయి కళ్లతో బాధితుల ఎదురు చూపు
కాకతీయ, నిఘాప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్.. ఈస్ట్ జోన్ పరిధిలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తించడం…నోరు పారేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. పోలీస్ చట్టాలు..పోలీసు సర్వీసు నిబంధనలతో సంబంధం లేకుండా సార్ ఇష్టానికి సొంత రూల్స్‌ను అమలు చేస్తూ న్యాయం చేయండని స్టేషన్ గడప తొక్కినా ఫిర్యాదు దారులనే భయబ్రాంతులకు గురి చేస్తుండటం గమనార్హం. గత రెండేళ్లేగా ఒకే స్థానంలో పోస్టింగ్‌లో ఉన్న సదరు అధికారి ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు.
మారు మాట్లాడితే..బూతులే..
ఈస్ట్ జోన్ పరిధిలోని ఓ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారికి మోనార్క్‌గా మారారన్న విమర్శలు సొంత డిపార్ట్‌మెంట్ నుంచే వినిపిస్తున్నాయి. తమ సమస్యను..తగాదాను పరిష్కరించాలని, కేసు నమోదు చేయాలని స్టేషన్‌కు చేరుకుంటున్న బాధితులు, ఫిర్యాదుదారులపై సార్ అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రాజకీయ వైరవీలకు పెద్దపీట వేస్తున్న అధికారి.. ఎవరిపైనేతై బాధితుల కంప్లైంట్ ఇస్తారో.. వారితో బేరసారాలు.. అవగాహన ఒప్పందంతో కేసును నీరుగార్చేందుకు వెనకాడటం లేదన్న విమర్శలున్నాయి. ఇదేంటి సార్..! జరిగిన ఘటనతో సంబంధం లేకుండా కంప్లైంట్ రాయమంటున్నారని బాధితులు ప్రశ్నిస్తే ఇక బూతుల దండకం వినిపిస్తున్నారని బాధితుల ద్వారా తెలుస్తోంది. ఆడ లేదా మగ లేదా.. పెద్దలనే గౌరవం అసలే.. ఆయన మాట కాదంటే చాలు సార్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. పోరా.. రారా.. అరేయ్.. తరేయ్.. పోవే..రావే..ఇది ఆయన ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన వారితో… ఫిర్యాదుదారులపై సార్ ఉపయోగించే వాడుక భాష.
ఉన్నతాధికారులన్నా..లెక్కేలేదు..!
ఫిర్యాదుతో సంబంధం లేకుండా సెటిల్‌మెంట్లు తాను సోషల్ సర్వీసు చేస్తున్నట్లుగా కటింగ్ ఇచ్చే సదరు అధికారి… రాజకీయ పలుకబడి ఉన్నవారికి కొమ్ముకాస్తూ ఫిర్యాదుదారులపైనే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. సదరు పెద్ద మనుషులకు, డబ్బు, రాజకీయ పలుకుబడి, ప్రభావ శీల వ్యక్తులకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెక్షన్లు.. కేసుల నమోదు చేపడుతుండటం సార్ సర్వీసు నైపుణ్యానికి నిదర్శనం. తాను చెప్పినట్లుగా రాస్తే మీకే ఎలాంటి ఇబ్బంది ఉండదని, లేదంటే అవతిలి వారు కూడా ఫిర్యాదు ఇస్తామంటున్నారు.. మీపైనా కఠినమైన సెక్షన్లు పెట్టాల్సి వస్తుంది..తర్వాత మీకు జైలు తప్పదంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. న్యాయం కావాలని వచ్చిన వారికి అన్యాయం చేస్తుండటం గమనార్హం. ఫిర్యాదు మార్చి రాయాలంటూ హుకూం జారీ చేసేస్తున్నారు.
సన్‌ప్రీత్ సార్.. మీరే జర చూడండి
సదరు స్టేషన్ అధికారి ఆగడాలు శ్రుతి మించిపోవడంతో స్టేషన్ పరిధిలోని జనాలు భయాందోళనకు గురవుతున్నారు. న్యాయం కావాలంటే రాజకీయ బలం ఉంటేనో.. పైరవీలు చేసేవాళ్లు ఉంటేనే స్టేషన్‌కు వెళ్లాలనే నిశ్చితాభిప్రాయానికి జనాలు వచ్చేయడం గమనార్హం. మోనార్క్ ఖాకీ స్టేషన్ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాడో అంటూ జనాలు వేయి కళ్లతో ఎదురు చూస్తుండటం గమనార్హం. సీపీ సన్‌ప్రీత్ సింగ్ సార్ హైవేపైనే ఉన్న సదరు పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న సార్ ఆగడాలపై ఓ నివేదిక తెప్పించుకుంటే ఎంతో మంది కన్నీటి కథలు..అధికారి ఆగడాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మరి సీపీ సార్ సదరు స్టేషన్ అధికారిపై దృష్టి పెడుతారా..? ఏం చేశారో తెలుసుకుంటారా..? ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం..!!


