కార్మిక హక్కులను హరించేస్తున్న మోడీ ప్రభుత్వం
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
నాలుగు లేబర్ కోడ్ల రద్దే లక్ష్యం
ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్
కాకతీయ, ఖమ్మం : మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చించకుండా పార్లమెంటులో పూర్తి ఆమోదం లేకుండానే నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని అమర్జిత్ కౌర్ డిమాండ్ చేశారు. 44 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 10 జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న చారిత్రక సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆమె తెలిపారు. సోమవారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మోడీ సర్కార్ కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకు కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని, కనీస వేతన చట్టం అమలులో పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. ఈ లేబర్ కోడ్లు అమలైతే ఉద్యోగ భద్రత, సోషల్ సెక్యూరిటీ, పెన్షన్, గ్రాట్యుటీ వంటి హక్కులు కార్మికులకు దూరమవుతాయని హెచ్చరించారు. ఆధార్, డీబీటీ పేరుతో అవినీతిని ఆపామని చెప్పడం మోసమని, వాస్తవానికి కార్మికుల హక్కులనే హరించారని ఆరోపించారు. 1920లో ఏర్పాటైన ఏఐటియుసి స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేస్తూ, బ్రిటిష్ పాలనలో పోరాడి సాధించిన హక్కులను ఇప్పుడు హరించేస్తున్నారని అన్నారు. రైతు సంఘాలు, బ్యాంకింగ్, రైల్వే, అసంఘటిత రంగ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.


