కాకతీయ, వరంగల్: హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వందల కోట్లు దోచుకుని బీసీలను మోసం చేసిన మాజీ పాలకులను తీవ్రంగా విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచకుండా రాజకీయ పార్టీలు, అగ్రకుల పెద్దలు కుట్రలు చేస్తున్నారని, సర్పంచ్ పదవుల నుండి కూడా బీసీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలను మోసం చేశారని, బీసీలకు, బీసీ మహిళలకు మోడీ చేసిన సహాయం ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు.
మాజీ సీఎం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సవరించిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రాగానే బీజేపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 42 శాతం రిజర్వేషన్ ఆమోదం తెలపకపోతే, స్థానిక ఎన్నికల అనంతరం బీసీల స్వంత రాజకీయ పార్టీ వస్తుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.


