విస్తృత ప్రచారంతోనే జనసమీకరణ
శతవసంత సభ జయప్రదమే లక్ష్యం
గ్రామగ్రామాన సీపీఐ కార్యాచరణ ఉండాలి
సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు పిలుపు
కాకతీయ, ఖమ్మం : సీపీఐ శతవసంత ముగింపు సభను చారిత్రకంగా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, భారీ జనసమీకరణే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు పిలుపునిచ్చారు. స్థానిక గిరిప్రసాద్ భవన్‌లో శుక్రవారం జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి కొండపర్తి గోవిందరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాగం హేమంతరావు మాట్లాడుతూ… జనవరి 18న జరిగే శతవసంత ముగింపు సభకు లక్షలాది మందిని తరలించడమే లక్ష్యంగా గ్రామగ్రామాన, ఇంటింటా సిపిఐ మహాసభ ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే తొలి దఫా ప్రచారం పూర్తయిందని, మండలాల్లో రెండో దశ ప్రచారం ప్రారంభమైందన్నారు.
10 నుంచి 17 వరకు కార్యాచరణ
ఈనెల 10 నుంచి 17 వరకు చేపట్టే కార్యాచరణను జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. 10న అలంకరణ కమిటీతో పాటు వివిధ కమిటీల బాధ్యుల సమావేశం, 11న ఖమ్మం నగరంతో పాటు ప్రధాన కేంద్రాల్లో కాగడాల ప్రదర్శన, 12న బహిరంగ సభ జయప్రదం కోరుతూ ట్రాక్టర్ ర్యాలీ, పతంగులు, బెలూన్ల ఏర్పాటు, అదే రోజు స్థానిక డీపీఆర్‌సీ భవనంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కవి సమ్మేళనంలో ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్తేజ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు కేవీఎల్, పల్లేరు వీరస్వామి, రాపోలు సుదర్శన్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కవులు పాల్గొంటారని వివరించారు.
ఇంటింటా సీపీఐ జెండా – ముగ్గుల పోటీలు
13న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు తమ ఇండ్లపై సీపీఐ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. 14న గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని, ఇందులో జాతీయ మహిళా సమాఖ్యతో పాటు యువజన, విద్యార్థి సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. ఇప్పటికే ఐదువేల మందికి జనసేవా దళ్ శిక్షణ ఇచ్చినట్లు, మరో రెండు రోజుల్లో మరికొంత మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లక్షలాది మంది సభకు హాజరవుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం నలువైపులా నుంచి నాలుగు ప్రదర్శనలుగా సభాస్థలికి చేరుకుంటారని, పెవిలియన్ మైదానం నుంచి వేలాది మంది జనసేవా దళ్ కార్యకర్తల కవాతు ఉంటుందని వివరించారు. సమావేశంలో రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, సిద్ధినేని కర్ణకుమార్, బీజీ క్లెమెంట్, అజ్మీరా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


