వరంగల్ పోలీసులపై డీజీపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు
ఎస్సీ–ఎస్టీ కేసుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ కోరిన సారయ్య
అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై చర్యలకు డిమాండ్
రౌడీయిజానికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణ
సీపీకి ముందే ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ పోలీసుల వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య రాష్ట్ర డీజీపీ డీజీపీ శివధర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన లిఖితపూర్వకంగా పలు అంశాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండేళ్లుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో తీవ్ర దుర్వినియోగం జరుగుతోందని సారయ్య ఆరోపించారు. ఈ కేసులన్నింటిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు పోలీసు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
అలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని వరంగల్ తూర్పు ప్రాంతంలో కొందరు రౌడీయిజానికి పాల్పడుతున్నారని, ఇది శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నదని సారయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల రక్షణే లక్ష్యంగా ఉండాల్సిన పోలీసు వ్యవస్థ, కొందరి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందన్న ఆరోపణలు ఆయన గుప్పించారు. ఈ అంశంపై ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సారయ్య వెల్లడించారు. పోలీసు శాఖ వ్యవహారంలో పారదర్శకత తీసుకువచ్చి, ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.


