ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!
కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం?
బావులకు కాంక్రీట్ గోడలు కట్టాలన్న రేవూరి సూచనలు పక్కనపెట్టారా
ఫెన్సింగ్‌తో సరిపెడుతున్న కాంట్రాక్టర్
గత ఏడాది ప్రమాదంలో భక్తుడు మృతి
విషాదం జరిగేదాకా చూస్తారా.. జరిగాక హామీ ఇస్తారా..?
కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతర ఏర్పాట్లలో భద్రతా చర్యలపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జాతరకు వచ్చే ప్రధాన మార్గాల్లో ఉన్న బావులకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రేవూరి స్పష్టంగా ఆదేశించినప్పటికీ, స్థలంలో మాత్రం ఆ ఆదేశాల అమలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొమ్మాల ఆర్చ్ నుంచి జాతరకు వెళ్లే దారిలో ఉన్న బావులు ప్రమాదకరమని గుర్తించి, రోడ్డు కొంత తగ్గినా పర్వాలేదు కానీ బలమైన కాంక్రీట్ గోడలు నిర్మించాలని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్లు సమాచారం. పంచాయతీరాజ్ ఏఈ సమక్షంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు.
ఆదేశాలు ఎక్కడ… అమలు ఎక్కడ?
సమీక్షలో భక్తుల ప్రాణ భద్రతే ప్రధానమని చెప్పినప్పటికీ, ప్రాంగణంలో మాత్రం కాంక్రీట్ గోడలు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సంబంధిత కాంట్రాక్టర్ శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా పనులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది ఇదే మార్గంలో ఉన్న ఒక బావిలో పడిపోవడంతో ఓ భక్తుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన తర్వాత శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రత్యేకంగా కాంక్రీట్ గోడల నిర్మాణంపై సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

ఫెన్సింగ్‌తో సరిపెట్టారా?
అయితే కాంక్రీట్ గోడల స్థానంలో ప్రస్తుతం తాత్కాలిక ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. భారీగా రద్దీ ఉండే జాతరలో కేవలం ఫెన్సింగ్‌తో భద్రత కల్పించడం ఎంతవరకు సరిపోతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అన్న చర్చ గ్రామంలో మొదలైంది.
వేలాది మంది భక్తులు హాజరయ్యే జాతరలో పూర్తి స్థాయి భద్రతా చర్యలు అవసరమని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. గత ఏడాది జరిగిన విషాదం పునరావృతం కాకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరోసారి ప్రమాదం జరిగేదాకా వేచి చూస్తారా? తరువాత హామీలు ఇస్తారా? అన్న ఆవేదన వ్యక్తమవుతోంది.


