ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం
కాకతీయ, నూగూరు వెంకటాపురం : నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ప్రజలకు మరింత సౌకర్యంగా ఆధార్ సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆధార్ నమోదు, సవరణల కోసం ఇకపై ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, మండల కేంద్రంలోనే శాశ్వత కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల పేదలు, వృద్ధులు, మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ కేంద్రం ప్రారంభం అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి పథకం చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళల సంక్షేమమే లక్ష్యంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
గ్రామ, మండల స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆధార్ కేంద్రం ద్వారా జనన, మరణ నమోదు, ఆధార్ అప్‌డేట్స్, చిరునామా సవరణలు వంటి సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.


