– యూరియాతో వస్తడనుకుంటే పోలీస్ పహారాలో వచ్చిండు
– 40బస్తాల లెక్క చెప్పని అధికారిపై చీటింగ్ కేసు పెట్టాలి
– మంథని ఎమ్మెల్యే అండతోనే యూరియా బ్లాక్ మార్కెట్‌కు
– పోలీసులు రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలే
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
కాకతీయ, పెద్దపల్లి: ఒక్క బస్తా యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుంటే.. రైతుల గోస పట్టించుకోకుండా మంథని ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి వెళ్లిపోయాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం మంథని పాత పెట్రోల్ బంక్ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకుని రైతు సేవా కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి వివరాల పై ఆరా తీశారు. అయితే సదరు వ్యాపారి బాబురావు గోదాంలో 110బస్తాలు ఉన్నాయని, ఇప్పటికే 40మంది టోకెన్లు తీసుకున్నారని వివరించారు.
ఈ క్రమంలో మిగిలిన వాటి గురించి అడుగగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారి, వ్యవసాయ అధికారులు, పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చౌరస్తాలో రైతులతో కలిసి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యే శుక్రవారం మంథనికి వస్తున్నాడంటే యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నామని, కానీ ఆయన వేల మంది పోలీస్ పహారాలో వచ్చి రైతులను కలువకుండా వారి గోస వినకుండా మీటింగ్‌లు పెట్టుకుని వెళ్లిపోయాడని అన్నారు.
మానీఫెస్టో కమిటి చైర్మన్‌గా, మంత్రిగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా రైతులను పట్టించుకోకపోవడంతో రైతులకు దిక్కుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలిచామన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి తాము సామరస్యంగా రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు తో మాట్లాడితే పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని, 110బస్తాలను 40మంది రైతులకు రెండు చొప్పున ఇస్తామని చెప్తుండగా వ్యవసాయ అధికారి మాత్రం రైతులకు 70బస్తాలు ఇస్తామని చెప్తున్నారని తెలిపారు. అయితే మిగిలిన 40బస్తాల మాటేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు.
మిగిలిన బస్తాలను రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులకు ఇస్తే వాళ్లు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే నాయకత్వంలోనే యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుందని, కల్వచర్లలో అక్రమంగా తరలిస్తున్న వంద బస్తాలను పట్టుకున్నారని ఆయన తెలిపారు. 40బస్తాలపై సమాధానం చెప్పని వ్యవసాయ అధికారిపై చీటింగ్ కేసు పెట్టాలని, సదరు వ్యాపారిపై కేసు పెట్టి విచారణ చేసి అసలు దోషులను బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రంలో జరిగిన వ్యవహారానికి మంథని ఎస్‌ఐ ప్రత్యక్ష సాక్షి అని ఆయన ముందే నిర్థారణ అయిందన్నారు. పోలీసులు సైతం అత్యుత్సాహం చూపుతున్నారని, పోలీసులు రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలే తప్ప కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకవద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా ఈ విషయంలో మానీఫెస్టో కమిటి, 420కమిటి చైర్మన్ స్పందించాలని, ఈ ప్రాంతల ప్రజల ఓట్లతో 40ఏండ్లుగా అధికారం వచ్చిందనే విషయాన్ని గుర్తించాలన్నారు.
గణపతి బప్పా మోరియా… కావాలయ్య యూరియా!
గణపతిబప్పా మోరియా కావాలయా యూరియా అంటూ పాత పెట్రోల్ బంక్ చౌరస్తా మార్మోగింది. రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు, వ్యవసాయ అధికారుల వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి – కాటారం ప్రధాన రహదారి పాత పెట్రోల్ బంకు చౌరస్తా లో ప్రభుత్వం సరిపడ యూరియా సరఫరా చేయాలనే డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గణనాథుడి విగ్రహాంతో ధర్నా నిర్వహించారు.
గణపతి బప్పా మోరియా…కావాలయ్య యూరియా అనే నినాదం తో విఘ్నేశ్వర స్వామికి భజన చేసి యూరియా బాధలను తీర్చాలంటూ స్వామివారిని వేడుకున్నారు. ఎరువుల దుకాణాల్లో దళారులకు లింకు పెట్టి అక్రమంగా యూరియా విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు.చివరకు రైతులకు యూరియా బస్తాలు ఇస్తామంటూ చెప్పడంతో ఆందోళణ విరమించారు. అనంతరం రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడిన రైతులకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వాటర్ బాటిల్స్ , బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు.


