అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని..
ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు..
రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరం..
రూ. 200 కోట్ల దోపిడీ ఆరోపణలు.. సీబీఐ, సిఐడి దర్యాప్తు డిమాండ్..
పార్క్ భూమి ఆక్రమణపై అసెంబ్లీలో హాట్ టాపిక్..
తప్పైతే రాజీనామా చేస్తా.. నాయిని సవాల్..
కాకతీయ, వరంగల్ బ్యూరో :తెలంగాణ అసెంబ్లీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో భారీ అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు తమను దొంగలుగా ఆరోపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సభలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు సుమారు రూ. 200 కోట్ల అక్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై వెంటనే సీబీఐ, సిఐడి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక తన ఆరోపణలు నిరాధారమని తేలితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా తమపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించగలిగితే రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హనుమకొండలోని పార్క్ భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై ప్రతిపక్షాలు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తన రాజీనామా లేఖను గౌరవ స్పీకర్‌కు పంపిస్తున్నానని ప్రకటించిన ఆయన, నిజం బయటపడే వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. సభలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. నాయిని వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత ముదురుతున్నాయి. ఈ అంశంపై త్వరలోనే మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం పై ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. నిజానిజాలు వెలికితీసే దిశగా దర్యాప్తు సంస్థలు ఎలా ముందుకు సాగుతాయన్నది ప్రస్తుతం కీలకంగా మారింది.


