మెక్సికో సుందరికి మిస్ యూనివర్స్ కిరీటం.. ఎవరీ ఫాతిమా బోష్?
కాకతీయ, ఇంటర్నేషనల్ డెస్క్ : థాయ్‌లాండ్‌లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరిగా నిలిచారు. పోటీల ఆరంభం నుంచే ఫేవరెట్‌గా నిలిచిన ఆమె, తన అందం మాత్రమే కాదు, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంతో కూడిన సమాధానాలతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ విజేత డెన్మార్క్ సుందరి విక్టోరియా క్జార్ థెల్విగ్, ఈసారి విజేతగా నిలిచిన ఫాతిమా బోష్‌కు కిరీటాన్ని అలంకరించారు. ప్రేక్షకులతో నిండిన హాల్లో మెక్సికో అనే పేరు వినిపించగానే హర్షధ్వానాలతో వేదిక మార్మోగింది. ఫైనల్ మోమెంట్‌లో ఫాతిమా గెలుపు గత ఏడాది కన్నా కూడా పెద్ద సెలబ్రేషన్‌గా మారింది.
ఫాతిమా విజయం మెక్సికోలో సంబరాలు రేపింది. అంతర్జాతీయ వేదికపై తమ దేశపు ప్రతిష్టను మరింతగా పెంచిందని మెక్సికో ప్రజలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ అంటే కిరీటం మాత్రమే కాదు.. ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ $250,000 (సుమారు రూ. 2.2 కోట్లు) ఇంటికి తీసుకువెళుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అలాగే విజేతకు న్యూయార్క్ నగరంలో ఒక హౌసింగ్ ఫెసిలిటీ, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు, ఈవెంట్లు, క్యాంపెయిన్‌లకు స్పాన్సర్డ్ యాక్సెస్ లభిస్తుంది. మిస్ యూనివర్స్‌గా ఒక సంవత్సరం పాటు $50,000(సుమారు రూ44 లక్షలు) జీతం కూడా అందుకుంటుంది. ఇది ఆమె ప్రయాణాలు మరియు ఆమె బ్రాండ్ కింద తీసుకున్న కార్యక్రమాలకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా మిస్ యూనివర్స్ 2026 ప్రకటించే వరకు ఫాతిమా బోష్ ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మహిళా సాధికారత, ఆరోగ్యం, విద్య, పర్యావరణ అవగాహన వంటి అంశాల్లో ప్రచారం చేయడం ఆమె ప్రధాన బాధ్యత.
ఎవరీ ఫాతిమా బోష్..
ఫాతిమా బాష్ 25 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్, ఆమె అమెరికా మరియు ఇటలీలో చదువుకుంది. చిన్న వయసులోనే ఆమెకు డిస్లెక్సియా మరియు ADHD ఉన్నట్లు నిర్ధారణ అయిం. కానీ ఆమె తన కలలను నిజం చేసుకునేందుకు చేసే ప్రయత్నంలో అవి ఎప్పుడూ అడ్డంకిగా మారనివ్వలేదు. నా బలహీనతలు కూడా నా బలం అవ్వొచ్చు అని నిరూపించిన మోడల్‌గా, ఫాతిమా యువతకు ఐకాన్‌గా మారింది. ఫాతిమా బోష్ టబాస్కో రాష్ట్రం నుంచి వచ్చిన మొదటి మిస్ మెక్సికో. క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. ప్రతి ఏడాది టబాస్కో ఆంకాలజీ హాస్పిటల్‌లో హాలిడే టాయ్ డ్రైవ్ నిర్వహిస్తుంటుంది. సస్టైనబుల్ ఫ్యాషన్ కు మద్దతు ఇస్తూ, పర్యావరణ హితమైన డిజైన్లను ప్రోత్సహించడం కూడా ఆమె ప్రత్యేక లక్ష్యం.
పోటీలకు ముందు జరిగిన వివాదం
ఫైనల్స్‌కు ముందు రిహార్సల్స్ సమయంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పేజెంట్ డైరెక్టర్ ఆమెపై కేకలు వేసారన్న ఆరోపణలతో ఫాతిమా ఈవెనింగ్ గౌన్, హీల్స్‌తోనే వేదిక నుంచి వాకౌట్ అయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసినా, కొద్ది సేపటికే శాంతించి, తిరిగి రిహార్సల్స్‌లో పాల్గొనడం ద్వారా తన ప్రొఫెషనలిజం, సమతుల్యాన్ని ప్రపంచానికి చూపించింది.


