మిర్యాలగూడ ఎమ్మెల్యే దొడ్డ మనసు
కుమారుడి రిసెప్షన్ డబ్బులు రూ.2కోట్లు సీఎంకు అందజేత
నియోజకవర్గ రైతుల సంక్షేమానికి వినియోగించాలని వినతి
సీఎంను కుటుంబ సభ్యులతో కలిసి చెక్కు అందజేత
ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే.. నెటిజన్ల నుంచి ప్రశంసలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దొడ్డ మనసు చాటుకున్నారు. లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించినప్పటికీ దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు అనుకున్న రూ.2కోట్లను రైతుల సంక్షేమానికి వినియోగించాలని సీఎంను కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం చెక్కు అందజేశారు. ఈ మొత్తాన్ని తన నియోజకవర్గ రైతుల సంక్షేమానికి ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుతూ.. కుటుంబ సభ్యులతో కలసి చెక్కును అందజేశారు.
ఆయన వెంట నల్గొండ లోక్‌సభ సభ్యుడు కుందూరు రఘువీర్ కూడా ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు. రైతులకు ప్రయోజనం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. లక్ష్మారెడ్డి తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


