- ఇంటికి పిలిపించుకుని అవమానిస్తున్నారు
- ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నివేదిక తెప్పించుకోవాలి
- సంబంధిత మంత్రులను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలి
- రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు
- యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపాలి
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్ర కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పై విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని, బాధ్యులైన మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి అరాచకాలు పెరిగిపోయాయని మహిళలపై అవమానకరమైన ప్రవర్తన చోటుచేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. సర్దార్ వల్లభాయి పటేల్ 150 జయంతి నేపథ్యంలో సోమవారం కరీంనగర్ లోని మేరా యువ భారత్ కార్యాలయంలో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి చట్టవ్యవస్థను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.
యూపీ తరహాలో ఉక్కుపాదం మోపాలి
ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు పోలీసులపై దాడులు, హత్యాయత్నాలు చేసే స్థాయికి పెట్రేగి పోతున్నారని నిజామాబాద్‌లో కానిస్టేబుల్ హత్య, హైదరాబాద్‌లో డీసీపీ చైతన్య పై హత్యాయత్నం జరిగినా ప్రభుత్వం మౌనంగా చూస్తోందని బండి సంజయ్ విమర్శించారు. గో రక్షులపై కూడా దాడులు జరుగుతున్నా పాలకులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎంకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఓట్ల కోసం జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిందని విమర్శించారు. యూపీ తరహాలో రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వంలా రౌడీషీటర్లకు బెయిల్ వచ్చినా బయటకు రానీయకుండా ఉండే విధంగా చట్టాలను కఠినతరం చేయాలన్నారు.
31నుంచి దేశమంతా ఐక్యతా మార్చ్..!
సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా సర్దార్@150 ఐక్యతా మార్చ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగే పాదయాత్రలో తానూ పాల్గొంటునున్నట్లు తెలిపారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక అని ఆయన స్ఫూర్తిని యువతలో నింపడం లక్ష్యమని తెలిపారు. తెలంగాణ విముక్తికి సర్దార్ పటేల్ చేసిన కృషిని గుర్తుచేస్తూ ఆయన లేక పోతే తెలంగాణ నేడు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌లా మారిపోయేదన్నారు. ఆయన స్ఫూర్తితో దేశ ఐక్యతను కాపాడుకోవాలని బండి పిలుపునిచ్చారు.


