ప్రజలను మభ్యపెట్టేలా మంత్రి సీతక్క హామీలు
వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట
అసెంబ్లీ ఎన్నికల హామీలే నెరవేర్చలేదు
ములుగులో చెక్కు చెదరని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్
రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్‌రెడ్డి
కాకతీయ,ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అన్ని రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైనా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చెక్కుచెదరకుండా నిలిచిందని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వై.సతీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడా మాత్రమే ఉండటం బీఆర్ఎస్ బలాన్ని స్పష్టంగా చాటుతోందన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని బెదిరింపుల ద్వారా సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. అయినప్పటికీ ఉపసర్పంచ్ పదవి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికే రావడం బీఆర్ఎస్ బలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పోలింగ్ జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పలు చోట్ల సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకుందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా మంత్రి సీతక్క గ్రామాల్లో తిరిగి పంచాయతీ ఎన్నికల ప్రచారం చేశారని, లెక్కకు మించి హామీలు ఇచ్చారని విమర్శించారు.
వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట
వెయ్యి మంది ఓటర్లు కూడా లేని గ్రామాల్లో 100 నుంచి 200 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. నియోజకవర్గం మొత్తానికి 15 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రచారం చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులపై పోలీసుల ద్వారా, కాంగ్రెస్ నేతల ద్వారా బెదిరింపులు చేశారని, పథకాల పేరుతో ప్రజలను భయపెట్టడం నెల రోజులుగా కొనసాగిందన్నారు. స్వయంగా మంత్రి సీతక్క అక్కడే ఉండి పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ చేశారని ఆరోపణలు గుప్పించారు. అన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ములుగు ప్రజలు బీఆర్ఎస్‌కు అండగా నిలిచారని తెలిపారు. ఏటూరునాగారం వంటి కీలక గ్రామపంచాయతీని బీఆర్ఎస్ కైవసం చేసుకుందని పేర్కొన్నారు. రెండు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 42 వేల ఓట్లు రాగా, బీఆర్ఎస్‌కు 37 వేల ఓట్లు వచ్చాయని, రెండు పార్టీల మధ్య కేవలం 5 వేల ఓట్ల తేడానే ఉందన్నారు.
ప్రలోభాలకు లొంగని ప్రజలు..!
సీతక్క ఎంత ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరించినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలిచారని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో బీఆర్ఎస్‌కు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులకు ఎదురునిలిచి పోరాడిన అభ్యర్థులకు, అండగా నిలిచిన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీ ఒత్తిడులకు ఎవరూ భయపడవద్దని, రాష్ట్ర నాయకత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


