కాకతీయ, ములుగు: 2026 మేడారం మహా జాతర దృష్ట్యా రవాణా, రోడ్ల సౌకర్యాలు, పార్కింగ్ ప్రదేశాలపై కసరత్తు చేస్తున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు. ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ తో బైక్‌పై మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఉపయోగించే రహదారుల పరిస్థితి, నూతన రోడ్ల అభివృద్ధిపై పలు సూచనలు చేశారు.
కొండపర్తి నుంచి గోనేపల్లి మీదుగా ఆర్టీసీ బస్‌స్టాండ్ వరకు కొత్త రోడ్డును అభివృద్ధి చేసేందుకు పరిశీలించారు. గోవిందరావుపేట మండలం ముత్తపురం నుంచి గోనేపల్లి మీదుగా కొంగలమడుగు వరకు ఎడ్లబండ్లతో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రోడ్డుకు ప్రణాళిక, కాల్వపల్లి, బయ్యక్కపేట వైపు నుంచి కన్నెపల్లి రోడ్డును పరిశీలించి కాల్వపల్లి నుంచి ఊరట్టం వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అడవి ప్రాంతాల్లోనే విస్తృత స్థాయిలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటుచేసి గ్రామాలపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయాలని అధికారులకు తెలిపారు.
ఎక్కువ మార్గాల ఏర్పాటు వల్ల పస్రా–నార్లపూర్–వెంగళాపూర్ మీదుగా ట్రాఫిక్ తగ్గించి, భక్తులు సులభంగా గద్దెలకు చేరుకునేలా మార్గాలు గుర్తించారు. ములుగు ఎస్పీ శబరీష్, స్థానిక డీఎస్పీ రవీందర్, పోలీస్ అధికారులు కలిసి ఈ ఏర్పాట్లను పరిశీలించారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ జామ్‌లు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలన్నారు. అత్యవసర వాహనాల కదలికకు ప్రత్యేక మార్గాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక మార్గాలు ఉండాలని స్పష్టం చేశారు. హోదా పక్కన పెట్టి మంత్రి సీతక్క ఎస్పీ బైక్‌పై ప్రయాణించారు.


