అధికారులకు మంత్రి పొంగులేటి వార్నింగ్
మేడారం పనుల్లో అలసత్వంపై సీరియస్
12వ తేదీకల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశం
నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలుంటాయని హెచ్చరిక
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లలో కనిపిస్తున్న నెమ్మదితనం, నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, శాఖాధికారుల పనితీరుపై మంత్రి ఘాటుగా మండిపడ్డారు. పనులు పూర్తి చేయకుండా కారణాలు చెప్పడం మానేయాలని అధికారులను మంత్రి హెచ్చరించారు. “ఎవరు కాంట్రాక్టర్లు? ఎవరి బాధ్యత? ఎప్పుడు పూర్తి చేస్తారు?” అంటూ ఒక్కొక్కరినీ నిలదీశారు. 12వ తేదీ లోపు అన్ని ప్రధాన పనులు పూర్తి కావాలని స్పష్టం చేస్తూ, ఆలస్యం జరిగితే బాధ్యులపై సస్పెన్షన్, రికవరీతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శాఖల పనితీరుపై అసంతృప్తి
విద్యుత్, ఆర్ అండ్ బీ, ఐటీడీఏ సహా అన్ని శాఖల పనుల పురోగతిపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మేడారం జాతర చిన్న కార్యక్రమం కాదు… ఇది రాష్ట్ర గౌరవానికి సంబంధించినది” అంటూ అధికారులకు గుర్తు చేశారు. 18వ తేదీ సీఎం పర్యటనకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. 15వ తేదీ నుంచి డెకరేషన్ పనులు ప్రారంభించి జాతర కాలమంతా ప్రాంతం మెరిసేలా చూడాలని ఆదేశించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, తాగునీరు, శానిటేషన్ వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకోసం సుమారు 4,000 మంది శానిటేషన్ సిబ్బందిని రంగంలోకి దించాలన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్‌గా పనిచేయాలని మంత్రి పొంగులేటి సీతక్క కఠిన ఆదేశాలు జారీ చేశారు


