కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్, పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రులు, విద్యాసంస్థల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలవుతోందని చెప్పారు.
జిల్లాకు ఇప్పటికే 18 టన్నుల యూరియా చేరిందని, ప్రతీ రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు యూరియా కోటా సాధించేందుకు మంత్రివర్గ బృందం త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు వెల్లడించారు. వైద్య, ఆరోగ్యశాఖ బలోపేతానికి పదోన్నతులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని హామీ ఇచ్చారు.


