వసతి గృహంలో మంత్రి ఆకస్మిక తనిఖీ
విద్యార్థులతో ముఖాముఖి చర్చించిన మంత్రి
కాకతీయ, భూపాలపల్లి : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సంరక్షణ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందుతున్న తీరును కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినిల సమస్యలపై సానుకూల స్పందన
వసతి గృహంలో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా తెలియజేయాలని కొంతమంది విద్యార్థినిలతో మంత్రి ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు పలు అంశాలను స్నేహపూర్వకంగా మంత్రికి వివరించారు. విద్యార్థుల రక్షణ కోసం వసతి గృహంలో ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీకి సూచించారు. అలాగే బయటి వ్యక్తులు ఎవరూ వసతి గృహంలోకి ప్రవేశించకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధనకు పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వసతి గృహంలో వంట సిబ్బంది సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థుల భద్రత, విద్య, నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం, అకౌంటబిలిటీ — ఈ ఐదు అంశాలపై అధికారులు దృష్టి సారించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మంత్రి ఓఎస్డి వై.జె. విజయ్ కుమార్, పీఆర్ఓ అమృత్ తదితరులు పాల్గొన్నారు.


