కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా విడుదలకు ముందే టికెట్ రేట్ల పెంపు పెద్ద దుమారం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఈ చిత్రానికి ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచినట్టు జారీ చేసిన జీవోపై ఇప్పుడు వివాదం చెలరేగింది.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులు జారీ చేయడం సరైన పని కాదని మంత్రి స్పష్టం చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో జీవో ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చారు అన్నట్టుగా వ్యవహరించారు. ఇకపై రాష్ట్రంలో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా టికెట్ ధర ఒకేలా ఉంటుంది. ప్రత్యేక రేట్ల పెంపు జరగదు” అని ఆయన ప్రకటించారు.
ఇకపోతే, తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. బుధవారం వెలువడిన ఆదేశాల్లో, ‘ఓజీ’ సినిమా టికెట్ ధరలు సాధారణ రేట్లకే విక్రయించాలి అని న్యాయస్థానం స్పష్టంచేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రీమియర్ షోలకు రూ. 800, సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 అదనంగా వసూలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు. అయితే హైకోర్టు ఈ ఉత్తర్వులను రద్దు చేసింది.ఈ పరిణామంపై కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఇకపై సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


