వీకర్స్ కాలనీకి రోడ్డు కేటాయింపుపై మంత్రి హామీ
కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి విచారణకు ఆదేశం
కాకతీయ, వరంగల్ సిటీ : వీకర్స్ కాలనీ నివాసితులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుభవార్త చెప్పారు. కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డును ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చిన అంశంపై కాలనీవాసులు వ్యక్తం చేసిన ఆవేదనకు మంత్రి స్పందించారు. వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాశీబుగ్గలో ఉన్న ఓసిటి ఇండోర్ స్టేడియం గేటు సమీపంలోని వీకర్స్ కాలనీ ప్రజలు మంగళవారం మంత్రిని కలసి వినతిపత్రం అందజేశారు. తమ కాలనీలోకి వెళ్లే ప్రధాన రహదారిని స్థానిక కార్పొరేటర్ 2010లో సొసైటీ సభ్యులతో కుమ్మక్కై ఫ్లాట్లుగా మార్చి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అనంతరం వాటిని విక్రయించాడని వారు వివరించారు. ప్రస్తుతం రహదారి మూసివేయడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిని పరిశీలించిన మంత్రి కొండా సురేఖ వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి, రహదారి అంశంపై సమగ్ర విచారణ జరిపి కాలనీవాసుల కోసం తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మంత్రి తక్షణ స్పందన పట్ల స్థానిక మహిళలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి ముందడుగు వేసినందుకు మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు


