కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ఆలయ అర్చకులు మంత్రికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు.కోనసీమలో విపత్తు జరిగితే తెలంగాణకు సంబంధం ఏంటని మాట్లాడటం చాలా బాధాకరం. రెండు రాష్ట్రాల మధ్య సోదరత్వం నెలకొన్న వేళ ప్రజల్లో అపార్థాలు రేపేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు కనీస పరస్పర గౌరవం అవసరం అని విమర్శించారు.పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మీ సినిమాలకు రెండు రాష్ట్రాల ప్రజలు అపారమైన అభిమానాన్ని చూపారు. అలాంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం తగదు అని మంత్రి అన్నారు.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను మండలాల వారీగా సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కార చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.


