గడ్డిగుట్టలో మినీ మేడారం జాతర
ఐదు లక్షలకు పైగా భక్తుల రాక అంచనా
ఈ నెల 28, 29న వనం విడిచి జనంలోకి సమ్మక్క–సారలక్కలు
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
పులిగుండం వాగు వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : తెలంగాణలో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సరిసమానంగా పేరు గాంచిన గడ్డిగుట్ట మినీ మేడారం జాతరకు వేళాయె. లక్ష్మీదేవి పల్లి మండలం తడికలపూడి గడ్డిగుట్ట–వేపలగడ్డ ప్రాంతాల్లో నిర్వహించే ఈ జాతర ఈ నెల 28, 29 తేదీలలో అంగరంగ వైభవంగా జరగనుంది. మేడారం జాతర ప్రారంభం కావడంతో అదే తరహాలో ఇక్కడి మినీ మేడారం జాతరపై భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. పూర్తిగా గిరిజన ప్రాంతంలో జరిగే ఈ జాతర ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
ఈ జాతరను శుద్ధ గిరిజన సంప్రదాయాల ప్రకారమే నిర్వహించడం ప్రత్యేకత. ఆదివాసీ గిరిజన పూజారులే వనదేవతలకు సంబంధించిన పూజలు నిర్వహిస్తూ జాతర విశిష్టతను చాటుతున్నారు. గడ్డిగుట్ట వేపలగడ్డ ప్రాంతాల్లో జరిగే ఈ జాతర సందర్భంగా పులిగుండం వాగు దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన షాపులు, ఇతర సదుపాయాలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ఆలయ కమిటీ అంచనా వేస్తోంది. గత 50 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ జాతర విశిష్టతను గ్రామాల నుంచి పట్టణాల వరకు చాటేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ప్రచారం చేపట్టింది. కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి, పులిగుండం, వేపలగడ్డ, హాలియా తండా, సర్వారం, బేతంపూడి, తడికలపూడి, తల్లాడ, జూలూరుపాడు, కాకర్ల, కొత్తగూడెం, రామవరం, సింగరేణి ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సమ్మక్క–సారలక్కలను దర్శించుకుంటారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 28, 29 తేదీలలో వనదేవతలు జనంలోకి వచ్చే ఘట్టం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. ఇందుకోసం గత పది రోజులుగా ఆదివాసీలు సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు. సమ్మక్క–సారలక్కల కొలుపులతో గడ్డిగుట్ట ప్రాంతమంతా మంగళ వాయిద్యాలతో మార్మోగనుంది. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లక్ష్మీదేవి పల్లి పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.
పులిగుండం వాగు వద్ద గట్టి నిఘా
దట్టమైన బండలతో ఏర్పడిన పులిగుండం వాగు వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు అనుమతి లేకుండా వాగులోకి వెళ్లకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు, ఈతగాళ్లను మోహరించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆలయ కమిటీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మినీ మేడారం జాతర ప్రధాన పూజారి ఊకే సీతమ్మ మాట్లాడుతూ.. గడ్డిగుట్ట ప్రాంతంలో గత 50 ఏళ్లుగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారమే ఈ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని, వనదేవతలను జనంలోకి తీసుకొచ్చే ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని చెప్పారు. జాతరను విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ బృందం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.


