మెస్సీ మేనియా
రేపు రేవంత్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్
రాత్రి 7 నుంచి 8 వరకు ఉప్పల్ స్టేడియంలో ..
హైదరాబాద్‌లో సందడిచేయనున్న ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ దిగ్గజం
రాజధానిలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
2,500 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలతో నిఘా
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో మెస్సీ మేనియా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ రేపు (శనివారం) రాజధానికి వస్తున్నారు. రాత్రి 7 నుంచి 9 వరకు ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌తో కలిసి మ్యాచ్ ఆడనున్నారు. తొలుత సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు రేవంత్‌రెడ్డి.. మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. అనంతరం యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది.
హైదరాబాద్ నగరంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ పర్యటన వేళ పండుగ వాతావరణం కనిపిస్తోంది. దగ్గజ క్రీడాకారుడు లియోనల్‌మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి మ్యాచ్ ఆడనుండటం ఈ పర్యటనలోనే హైలైట్‌గా భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులు.. 450 సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటుచేశారు. ఉప్పల్‌స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ పర్యవేక్షించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు.
ఫలక్‌నుమాలో బస
23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉప్పల్ స్టేడియంను భద్రతా అవసరాల రీత్యా నాలుగు సెక్టార్లుగా విభజించారు. 39 వేల మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉప్పల్‌స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఒక్క ఉప్పల్స్టేడియంలోనే రాచకొండ పోలీసులు సుమారు 2, 500 మందితో బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి అదనంగా స్టేడియం లోపల 1000 మంది వలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్, ఉప్పల్‌స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. 13 తేదీ రాత్రికి ఫలక్ నుమా ప్యాలెస్ లో మెస్సీ బస చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పాస్‌లు ఉంటేనే అనుమతి
ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌కు టికెట్లు, పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ సాకర్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలనుకునే వారు రూ.10 లక్షలు చెల్లించి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకోసం 100 ప్రత్యేకమైన స్లాట్‌లను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే సాకర్ మ్యాచ్‌లో సహచర ప్లేయర్లు రోడ్రిగో డీ పాల్, లుయిస్ సురెజ్‌తో కలిసి మెస్సీ బరిలో దిగనున్నాడు. 20 నిమిషాలు జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్-9 టీమ్, మెస్సీ ఆల్‌స్టార్స్ తలపడనున్నాయి. షూటౌట్ సెగ్మెంట్‌లో పిల్లలకు మెస్సీ మెళకువలు నేర్పించనున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాత్రికి హైదరాబాద్‌లో బస చేసే మెస్సీ.. ఆదివారం ముంబైకి బయల్దేరి వెళ్లనున్నాడు.
మెస్సీకి జెడ్ కేటగిరి భద్రత : రాచకొండ సీపీ సుధీర్ బాబు
సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని… ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని వెల్లడించారు. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్స్ లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని కోరారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 2500 మంది పోలీసులు మ్యాచ్ కోసం భద్రతా విధుల్లో ఉంటారన్నారు. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కదలికలపై నిఘా పెడతారని వెల్లడించారు. నిషేధిత వస్తువులు స్టేడియం లోపలికి తీసుకు రావద్దన్నారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.


