మానసిక దృఢత్వమే విద్యార్థుల అసలైన బలం
లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు
బాలల భవిష్యత్తుకు కలెక్టర్ దిశానిర్దేశం
కాకతీయ, నర్సంపేట టౌన్ : విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల వృద్ధి, మానసిక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యంగా ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. నర్సంపేట సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాసులు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని, క్రమశిక్షణతో, ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి పెడితే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించవచ్చన్నారు. జీవన నైపుణ్యాలు, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే రెండు షార్ట్ ఫిలింలను విద్యార్థులతో కలిసి వీక్షించిన కలెక్టర్, అందులోని సందేశాలను విద్యార్థుల నుంచే రాబట్టారు. భయం విడిచిపెట్టినప్పుడే సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. యూనిసెఫ్, యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జీవన నైపుణ్యాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 111 పాఠశాలల్లో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, విశ్రాంత ఉపాధ్యాయులు, వివిధ రంగాల నిపుణుల సహకారంతో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు, పోటీతత్వం, ఒత్తిడి, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భయాన్ని తొలగిస్తే విద్యార్థులు మరింత తెలివిగా, సృజనాత్మకంగా ఎదుగుతారని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల హాజరు రిజిస్టర్, ఫిర్యాదుల పెట్టె, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ మెరుగైన బోధన అందించాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదుల పెట్టెలో తెలియజేయాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సంపేట తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


