వరంగల్‌లో మెడికిల్
రోగం లేకున్నా మందులు అంటగడుతున్న ఆస్పత్రులు
కమీషన్ల కోసమే రోగులకు అడ్డగోలుగా మందుల విక్రయం
సైడ్ ఎఫెక్టలతో లేని రోగాలను కొనితెచ్చుకుంటున్న జనం
నిబంధనలకు పాతర వేస్తూ ధనార్జనే ధ్యేయంగా మెడికల్ వ్యాపారం
అధిక ధరకు విక్రయిస్తూ దోపిడీ..! కనిపించని డ్రంగ్ అధికారుల తనిఖీలు
బోలెడన్నీ చేసినట్లుగా రికార్డులు సృష్టి..!
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెడికల్ షాపులపై నియంత్రణ కొరవడింది. సంబంధిత షాపుల నిర్వాహకులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ధనార్జనే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 800లకు పైగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. ఇందులో చాలా వరకు నిబంధనలను పాటించడం లేదు. కొనుగోలు చేసిన మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా విక్రయాలు చేపడుతుండటం గమనార్హం. యాంటిబయాటిక్ మందులను డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఇవ్వాల్సివుంటుంది. కానీ షాపుల నిర్వాహకులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తూ యాంటిబయాటిక్ మందులను అందజేస్తున్నారు. వాడిన వారు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త రోగాల బారిన పడుతున్నారు.
అధిక ధరకు విక్రయిస్తూ దోపిడీ..!
తకువ ధరకే దొరికే జనరిక్ మందులను అధిక ధరకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు మెడికల్ దుకాణాలకు ఇచ్చే ప్రతి డ్రగ్‌పై బ్యాచ్ నంబర్ ఉంటుంది. ఇలా రిటైల్ దుకాణాలకు ఇచ్చే సమయంలో బిల్లుపై పొందుపర్చిన బ్యాచ్ నంబర్, కొనుగోలుదారులకు ఇచ్చే బిల్లుపై రాసే బ్యాచ్ నంబరు కూడా ఒక విధంగా ఉంటేనే సరైనవేనని నమ్మవచ్చు. కానీ, రెండు బిల్లులపై వేర్వేరు నంబర్లు ఉండడంతో నకిలీ మందుల దందా కొనసాగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
హోల్‌సెల్ ఏజెన్సీలతోపాలు, మెడికల్ దుకాణాలపై ఔషధ నియంత్రణ విభాగం నిఘా పూర్తిగా కొరవడింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్ని షాపులకు అనుమతి ఉంది? నిబంధనలు అతిక్రమిస్తూ మందులు ఎవరు విక్రయిస్తున్నారనే విషయంపై తనిఖీలు ఉండడం లేదు. దీంతో మందుల పాపుల యజమానులు జనరిక్ మందులు ఇచ్చి బ్రాండెడ్ మందుల ముసుగులో దోపిడీ చేస్తున్నారు.
నిబంధనలకు మత్తు మందు…
చాలా మెడికల్ షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండానే విక్రయాలు జరిగిపోతున్నాయి. కనీసం ఫార్మసిస్టు పర్యవేక్షణలోనైనా మందులను ఇవ్వాల్సివుండగా 10వ తరగతి, ఇంటర్ అర్హత కల్గిన వారితో మందుల విక్రయాలు చేపడుతున్నారు. ఫార్మసీ పూర్తిచేసిన వారి సర్టిఫికెట్లతో షాపుల నిర్వాహకులు తమ దందాను సాగిస్తున్నారు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించవద్దనే నిబంధనను మెడికల్ షాపుల యజమానులు తుంగలో తొకుతున్నారు. మెడికల్ షాపు నిర్వహించే ఫార్మసిస్టు డ్రెస్ కోడ్‌తోపాటు మందులు అందించే సమయంలో గ్లౌజులు వేసుకోవాలి. కొన్ని మందులను ఫ్రిజ్‌లో మాత్రమే భద్రపరచాలి. వినియోగదారుడికి కచ్చితంగా మందుల వివరాలతో కూడిన బిల్లు ఇవ్వాలి. కానీ, ఏదో ఒకటి, రెండు షాపుల్లో తప్ప మిగతా దుకాణాల్లో ఇది అమలు కావడం లేదు. మెడికల్ దుకాణాల యజమానుల యూనియన్ కనుసన్నల్లో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు నడుస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కమీషనిస్తే చాలు…
మందుల విక్రయం పెద్ద వ్యాపారంగా మారింది. తమ కంపెనీకి చెందిన కోటి విలువ చేసే మందులు సేల్ చేస్తే అందులో 40 శాతం కమీషన్ ఇస్తామని నిర్వాహకులు వైద్యులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో వైద్యులు ఆ కంపెనీ మందులు సేల్ చేసేందుకు అవసరం ఉన్నా లేకున్నా రోగుల నెత్తిన రుద్దుతున్నారు. ప్రొటీన్ పౌడర్ బ్రాండెడ్ 150కి లభిస్తుండగా జనరిక్‌లో 25కు లభిస్తుంది. ఎన్‌జైమ్ సిరప్ 60కు లభిస్తే జనరిక్‌లో 25కు, ట్యాబ్లెట్ ఎసినిక్ ప్లస్ బ్రాండెడ్‌లో 50కు లభిస్తుండగా, జనరిక్ షాపుల్లో 10లకు దొరుకుతుంది. అయితే, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయని కారణంగా రోగులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు.
అనుమతులు తప్పనిసరి.. కానీ…
డ్రగ్ అండ్ కాస్మోటిక్ యాక్టు-1940, ఫార్మసీ యాక్టు-1948 ప్రకారంగా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ పూర్తి చేసిన వారు మాత్రమే మెడికల్ షాపులను నిర్వహించాల్సి వుంటుంది. షాపు పర్మిషన్ తీసుకునే సందర్భంలో సంబంధిత పార్మసిస్టుల సర్టిఫికెట్లతోపాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు ప్రతులు, చిరునామా తదితర వివరాలు దరఖాస్తుతో అనుసంధానం చేసి డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించాల్సి వుంటుంది. అనంతరం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు మంజూరైన తర్వాతే షాపులను నిర్వాహించాల్సి వుంటుంది.
తూతూ మంత్రంగానే తనిఖీలు…
ఔషధ తనిఖీ అధికారి (డ్రగ్ ఇన్స్‌పెక్టర్) లు తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహించి మెడికల్ షాపుల్లో అంత సవ్యంగా ఉందన్నట్టులగా రిపోర్టులు అందజేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. జిల్లాలో తనిఖీలు చేపట్టినట్లుగా అధికారులు రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా కూడా విమర్శలు.. మెడికల్ షాపుల్లో జరిగే తనిఖీలు.. ఆ వివరాలను కనీసం మీడియాకు కూడా తెలపకపోవడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


