పంతులుపల్లి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు
కాకతీయ.నల్ల బెల్లి: నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్‌బీఎస్‌కే) కార్యక్రమం ఆధ్వర్యంలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వి.భవిత, డాక్టర్ డి.స్వర్ణలతలు విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు తగు సూచనలు చేస్తూ, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు తెలిపారు. డాక్టర్ భవిత మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులు చదువులో రాణించగలరు. చిన్నతనం నుంచే పోషకాహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం వల్ల మానసిక-శారీరక ఎదుగుదల సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కర్ణకంటి రామ్మూర్తి, ఉపాధ్యాయులు కూనమళ్ల రాజన్ బాబు, ఆర్‌బీఎస్‌కే ఫార్మసిస్టు స్మిత, ఏఎన్ఎం జులేఖ పాల్గొన్నారు.


