మీడియా అక్రెడిటేషన్ రూల్స్–2025 అమల్లోకి
పాత నిబంధనలకు స్వస్తి..
డిజిటల్ మీడియాకు తొలిసారి స్పష్టమైన మార్గదర్శకాలు
అర్హతలు, పరిమితులు కఠినం.. దుర్వినియోగంపై కఠిన చర్యలు
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ *‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్–2025’*ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.252ను జారీ చేసింది. కొత్త నిబంధనలతో అక్రెడిటేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అక్రెడిటేషన్ కమిటీలకు రెండేళ్ల కాలపరిమితి
కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థాయి (SMAC), జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీకాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించారు. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాత కమిటీలే కొనసాగుతాయి. రిపోర్టర్లకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డు ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు అధికారిక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే మీడియా కార్డు మాత్రం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే పరిమితమవుతుంది.
డిజిటల్ మీడియాకు తొలిసారి స్పష్టమైన నిబంధనలు
డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వడంపై ప్రభుత్వం తొలిసారిగా స్పష్టమైన ప్రమాణాలను నిర్ణయించింది. సంబంధిత వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల యూనిక్ విజిటర్స్ ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా విభాగంలో గరిష్టంగా 10 అక్రెడిటేషన్ కార్డులు మాత్రమే జారీ చేయనున్నారు.
అర్హతలు కఠినతరం
న్యూస్ పేపర్లకు కనీసం 2,000 ప్రతుల సర్క్యులేషన్ ఉండాలి. పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో శాటిలైట్ ఛానళ్లు కనీసం 50 శాతం వార్తా కంటెంట్ కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం మూడు వార్తా బులెటిన్లు ప్రసారం చేయాలి. స్టేట్ లెవల్ అక్రెడిటేషన్‌కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి.
ఫ్రీలాన్స్, వెటరన్ జర్నలిస్టులకు అవకాశం
15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, అలాగే 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా అక్రెడిటేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కమిటీల నిర్మాణం
రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ కమిటీకి మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షుడిగా, ఐఅండ్పిఆర్ కమిషనర్ కో-చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు కమిటీలో ఉంటారు.
జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు
అక్రెడిటేషన్ కార్డుల దుర్వినియోగం, తప్పుడు సమాచారం అందించడం లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కార్డు పోగొట్టుకుంటే డూప్లికేట్ కార్డు కోసం రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలతో అక్రెడిటేషన్ ప్రక్రియలో స్పష్టత, క్రమశిక్షణ పెరుగుతుందని, వృత్తిపరమైన జర్నలిజానికి ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.


