కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర గద్దెల విస్తరణ అంశంపై రాజకీయ పార్టీలు, కుల సంఘాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, జాతర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని మేడారం పూజారుల (వడ్డెల) సంఘం స్పష్టం చేసింది. సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాలరావు ఓ ప్రకటన జారీ చేశారు.
1944 నుంచి ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం జాతర జరుగుతుందని, పూజారులు ఎదుర్కొనే సమస్యలు, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు విడతలుగా కలెక్టర్, మంత్రులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. ఇటీవల పూజారులు, ఆదివాసీ కుల పెద్దలు సమావేశమై గద్దెల ప్రాంతం, ప్రకారం, ఆర్చ్ గేట్లు, దేవుళ్ల పడగలపై ముద్రించబోయే చిత్రాలపై నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు.
అయితే కొంతమంది రాజకీయ పార్టీలు పూజారుల సలహాలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికి ముందుచూపు లేదని ఆరోపించడం అర్థరహితం అని పూజారుల సంఘం పేర్కొంది. జాతర అభివృద్ధి అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించింది. జాతర భూములపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుమని, పనికొచ్చే సలహాలు ఇస్తే స్వాగతిస్తాం.. కానీ దేవుడి భూములపై, జాతర అభివృద్ధిపై అడ్డంకులు సృష్టిస్తే సహింబోని తెలిపారు. సంఘం జాతర అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ అమలు పట్ల తాము పూర్తి సహకారం అందిస్తామని, రాజకీయాలు పక్కన పెట్టి సమష్టిగా అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేసింది.


