జనసంద్రంగా మేడారం!
లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు
కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక సౌకర్యాలు
తాగునీరు, మరుగుదొడ్ల కొరతపై భక్తుల ఆగ్రహం
ఇబ్బందుల నడుమ కూడా అమ్మవార్ల దర్శనంతో పరవశం
కాకతీయ, ములుగు ప్రతినిధి : సంక్రాంతి పండుగ ముగియగానే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. సెలవులు ముగిసినప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతమంతా భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం బంగారు బుట్టలను తలపై పెట్టుకొని గద్దల వైపు సాగారు. తమ కోరికలు తీరాలనే ఆకాంక్షతో “కొంగు బంగారం”గా ప్రసిద్ధిగాంచిన వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మలకు వడి బియ్యం, బంగారం, చీరలు, సారెలు, పసుపు–కుంకుమ, కొబ్బరికాయలతో నైవేద్యాలు సమర్పించారు. అమ్మవార్ల కృపతో కుటుంబాలు సుఖశాంతులతో, పిల్లాపాపలు పాడిపంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. మొక్కులు చెల్లించిన అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా కంక వనాల మధ్య ఉన్న పచ్చని ప్రకృతిలో వంటావార్పు చేసుకుంటూ జాతర ఆనందాన్ని ఆస్వాదించారు. చిన్నారులు అడవీ ప్రాంతంలో ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు. పెద్దలు అమ్మవార్ల కథలను, జాతర విశిష్టతను పిల్లలకు వివరిస్తూ సంప్రదాయాన్ని తరతరాలకు అందించారు. ఈ విధంగా మేడారం మహాజాతర ప్రతి కుటుంబానికి మరపురాని అనుభూతిగా మారింది. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం విశేషం.

కనిపించని సౌకర్యాలు.. భక్తుల అవస్థలు
భక్తుల రద్దీ పెరిగిన మేరకు సౌకర్యాలు అందకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది. జంపన్న వాగు, గద్దల పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు జాతర సమయానికి అందుబాటులోకి రాకుండా తాడులతో కట్టివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరుగుదొడ్లు లేని పరిస్థితుల్లో చాలామంది ఆరుబయటే మలమూత్రాలు చేయాల్సి రావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆపరేటర్ ట్యాప్స్‌లో నీరు లేకపోవడంతో భక్తులు చేతిపంపులపైనే ఆధారపడ్డారు. తెచ్చుకున్న నీటిని పరస్పరం పంచుకుంటూ నీటి ఎద్దడిని తట్టుకున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పించినప్పటికీ, జాతర సమయంలోనే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని భక్తులు, స్థానికులు విమర్శిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీరు, పార్కింగ్, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు మరింత సమర్థంగా అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అన్ని ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు అమ్మవార్ల దర్శనంతో పరవశించి, మేడారం మహాజాతరను జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మలుచుకుని ఆనందంగా తమ గమ్యస్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు.


