కమీషన్ల కోసమే మేడారం జాతర పనుల కాలయాపన
బిఆర్ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం జాతరకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా ఇప్పటికీ అభివృద్ధి పనులు ప్రారంభం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పుడు కేవలం 117 కోట్లు మాత్రమే విడుదల చేసింది అని, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం, కొన్ని చోట్ల నత్తనడకన సాగడం వల్ల ఈసారి జాతర సమయానికి సదుపాయాలు పూర్తవుతాయా లేదా అన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి అని పేర్కొన్నారు. జాతరలో పాల్గొనే లక్షలాది భక్తులకు తాగునీరు, టాయ్లెట్లు, పార్కింగ్, రోడ్ల విస్తరణ, చెట్లు–నీడ వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. పచ్చని మేడారం ఇప్పుడు ఎడారిలా మారిపోయింది అని, చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతిన్నది అని, గ్రామస్తులు తమ ఇంటి ముందు ఉన్న షేడ్లు, పందిళ్లు తొలగించినా రోడ్లు, కల్వర్టులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుడి మూడు ఎకరాల్లో ఉంటే, దాని వెనక 20 ఎకరాలు రైతుల భూములు జప్తు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని, ఇది ఆదివాసీల అస్తిత్వంపై దాడి చేసినట్లే అని, వనదేవతల ఆవరణలో ఉన్న 300 పైగా చెట్లను నరికేయడం పాపం అని, గ్రామ సభ ఏర్పాటు చేయకుండా చెట్లు తుడిచేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు అని నాగజ్యోతి ప్రశ్నించారు. అలాగే ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్‌లు, పబ్లిక్ టాయ్లెట్స్‌ను వాడకం లోకి తీసుకోకపోవడం, పాత ప్రాజెక్టులను వదిలేసి కొత్త మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల పంట పొలాలపై కన్నేయడం దారుణమని ఆమె విమర్శించారు. జాతర సమయంలో ప్రజల సౌకర్యాలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఈ ప్రభుత్వం కమీషన్ల కోసమే పనులను ఆలస్యం చేస్తోంది అని, అధికారులు, కాంట్రాక్టర్లు లాభాల పంటలు కోసుకునేలోపు భక్తులు, స్థానికులు నష్టపోతున్నారు అని బడే నాగజ్యోతి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, రామ సహాయం శ్రీనివాసరెడ్డి, పోగు నాగేష్, చిడం బాబురావు, శ్రీధర్ గొంది, శివరాజ్, సమ్మిరెడ్డి, కొర్నిబెల్లి శేషగిరి, సురేష్, ఇంద్రారెడ్డి, జీడిబాబు తదితరులు పాల్గొన్నారు.


