మేడారం జాతరను విజయవంతం చేయాలి
జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకం
ఫీల్డ్ విజిట్లు తప్పనిసరి..
మేడారం జాతర సిబ్బందికి మూడు రోజుల ప్రత్యేక శిక్షణ
భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ములుగు కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోమవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్‌లో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్‌రావుతో కలిసి జోనల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మేడారం జాతర సజావుగా సాగాలంటే జోనల్ అధికారులు సెక్టర్ అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచించారు. జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు జోనల్, సెక్టర్ అధికారులు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్లు చేయాలని ఆదేశించారు.
ప్రత్యేక శిక్షణ, మూడు షిఫ్టుల విధులు
జోనల్ అధికారులు, సెక్టర్ అధికారులు, వివిధ శాఖల అధికారులకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతర సమయంలో మూడు షిఫ్టుల వారీగా అధికారులు విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి జోనల్ పరిధిలో త్రాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు నిరంతరాయంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతరలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేష్, డీఎస్పీ రవీందర్, జోనల్ అధికారులు, సెక్టర్ అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


