- ఎర్ర శేఖర్ కాంగ్రెస్‌లో చేరడానికి వీల్లేదు
- సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముణ్ని చంపిండు
- పార్టీకి మోసం చేసిన వారిని తిరిగి తీసుకోవద్దు
- Z కేటగిరి సెక్యూరిటీ అడగాలా ?
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఎర్రశేఖర్.. తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలను ఎమ్మెల్యే పూర్తిగా ఖండించారు.
ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీల్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి, మూటలు తీసుకుని పోయినోళ్లకు మళ్లీ ఎంట్రీ లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి మోసం చేసిన వారిని తిరిగి తీసుకోమని తెలిపారు. సొంత తమ్ముణ్ని సర్పంచ్ పదవి కోసం చంపారని.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. జడ్ కేటగిరీ భద్రత అడగాలని.. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని తనకు లేదని అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకోరు
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి గేటు వద్దకు వెళ్లినా కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకదని, కావాలనే ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని తిరిగి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ స్పష్టతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అనిరుధ్‌రెడ్డి కామెంట్స్ జడ్చర్ల నియోజకవర్గంలో హాట్ టాఫిక్‌గా మారాయి.


