సత్య మేవ జయతే..!
సత్యం ఎక్కడైనా.. ఎన్నంటికైనా గెలుస్తుందనేది ఈ నానుడి సందేశం. సత్యమే గెలవాలని.. సత్యాన్నే గెలిపించాలనే లక్ష్యంతో కాకతీయ మీడియాను ప్రారంభిస్తున్నాం. డిజిటల్ మీడియా ఫార్మాట్‌లో దినపత్రిక, వెబ్సైట్‌తో పాటు యూట్యూబ్‌ను ఆరంభిస్తున్నాం. ఒక సమున్నత లక్ష్యంతో కాకతీయ మీడియాను స్టార్ట్ చేయడం జరుగుతోంది. అన్ని ఫార్మాట్లలో ఎప్పటికప్పుడు వార్తలు, విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక కథనాలను అందించే విధంగా వ్యవస్థలను రూపొందించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠకలోకానికి కొన్ని స్పష్టమైన వాగ్దానాలు చేయదల్చుకున్నాం.

సత్యాన్ని గెలిపించేందుకు కలం కవాతు చేసేందుకు మంచికి-మంచి. చెడుకు- చెడు అనే లక్షణాలతో.. నిప్పుకణికల్లాంటి అక్షర తూటాలను పేల్చడానికి మేం సిద్ధం. దారితప్పిన వారికి మా దగడెంటో చూపిస్తాం. దగుల్బాజీ వ్యవస్థపై కాకతీయ కలం దండయాత్ర కొనసాగుతుంది. పాలకపక్షం మంచిని జనంలోకి తీసుకెళ్తాం. చెడును, తప్పిదాలను కూడా నిట్టనిలువునా ఎండగడుతాం. ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు, ఉద్యమాల గొంతుకకు వేదికవుతాం.జర్నలిజాన్ని ఉద్యమంగా నడిపించాలనే ఆకాంక్షతో..గొప్ప ఆలోచనలతో పాఠకుల ముందుకు వస్తున్నాం.
మేం చేస్తున్న వాగ్దానాలకు కట్టుబడి ఉండేందుకు కంకణబద్దులమై ఉన్నాం. సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రజలకు కళ్లకు కడుతూ జాగృతం చేసే లక్ష్యం నిర్దేశించుకున్నాం. అక్షర సమరంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. నిజాయితీ, నిర్భితీ కలిగి ఉండి.. అక్షర సమరం సాగించేందుకు ఆసక్తి ఉన్న సీనియర్ జర్నలిస్టులను, యువ జర్నలిస్టులను ఆహ్వానిస్తున్నాం.
ప్రజాపక్షం, ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన పాత్రికేయం సాగిలపడుతోంది. అనేకానేక అవస్థలు, ఆర్థిక అవసరాలు కూడా ఇందుకు కారణమవుతూ ఉండవచ్చు. ఈక్రమంలోనే వంతపాడటం, సర్దుకుపోవడమో చేస్తున్నాయి. పార్టీల వారీగా భజన కార్యక్రమాన్ని పత్రికలు, చానెళ్లు నెత్తికెత్తుకున్నాయి.
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సిన మీడియాలోని అనేక చానెళ్లు, పత్రికలు భజన చేయడం.. లేదంటే.. కాదంటే.. విషం చిమ్మడం పనిగా పెట్టుకుంటున్నాయి.. నిస్సిగ్గుగా కిరాయి రాతలకు.. రోత కూతలకు తెగబడుతున్నారు. విచక్షణ, వివేకం లేకుండా వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియా వింగ్‌ల పేరిట సిరాక్షసులు పుట్టుకొస్తున్నారు. తప్పును ఒప్పు చేసేందుకు.. ఒప్పును తప్పుగా చూపేందుకు పార్టీల తరుపున, రాజకీయ శక్తిగా మారేం
దుకు వ్యక్తులు ఏర్పాటు చేసిన మీడియా, పత్రికలు విధానాలుగా మార్చుకున్న సందర్భాలు మన కళ్ల ముందు కనబడుతున్నాయి.
ఫలానా పత్రిక ఆ పార్టీకి సపోర్ట్.. ఆ చానెల్ వ్యవహారం కూడా అంతే.. న్యూట్రల్ స్టాండ్, ఉన్నది ఉన్నట్లుగా వార్తలను ప్రచురించే దినపత్రికలు, ప్రసారం చేసే చానెళ్లు లేవన్న అభిప్రాయం పాఠకుల్లో ఏర్పడింది. ఓ పత్రిక ఏ పార్టీకి? ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో? కూడా పాఠకులు ఇట్టే పసిగట్టగలుతున్నారు. ఇలాంటి సందర్భంలో పత్రికల కథనాలు, వార్తలకు పూర్తి విశ్వసనీయత లేకుండాపోతోంది. ఒకే వార్త ఎక్కువ, తక్కువలతో పత్రికల్లో స్పేస్‌ను ఆక్రమిస్తున్నాయి. ప్రాధాన్యం, అప్రాధాన్యంగా ప్రచురితమవుతున్నాయి. దానికి పత్రికలకు స్టాండ్‌ల పేరిట ఉన్న విధానాలే కారణమవడం గమనార్హం. ఈ పరిస్థితులు పాఠకుల్లోనూ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఏదీ నిజం అన్న సంశయం వారిని వెంటాడుతోంది.
ఇలాంటి సందర్భంలో నిక్కచ్చిగా వార్తలందించే పాత్రికేయం అవసరమనిపించింది. కాకతీయ పత్రికను సబ్బండ వర్గాల గొంతుకగా మార్చేందుకు సిద్ధపడ్డాం. నిజాలను నిర్భయంగా పాఠకుల ముందు పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాం. నిజాన్ని నిలబెడుతాం.. తప్పు తుప్పు రేగ్గొడతాం.. దమ్మున్న వార్తలతో దుమ్ము రేపడమే మా లక్ష్యం. మాకు భయం లేదు.. భజన అసలే ఉండదు. సమాజ హితం..సత్యాన్ని గెలిపించడమే మా ధ్యేయం. ఆధారాలతో వస్తే అరక్షణం ఆలస్యం చేయకుండా వార్తను జనంలోకి తీసుకెళ్తాం.. ఈ అక్షర పోరాటంలో ప్రజలందరి భాగస్వామ్యాన్ని స్వీకరిస్తాం.
సద్విమర్శలను అంగీకరిస్తాం.. సవాళ్లకు, సాహసాలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎప్పటికప్పుడు చరిత్రను లిఖిస్తూనే ఉంటాం… మేం రాసే ప్రతీ అక్షరానికి మీరే సాక్ష్యం. సుదీర్ఘకాలం కొనసాగింపునకు స్పష్టమైన విధానాలు, లక్ష్యాలు, లక్షణాల రూపకల్పన చేయడం జరిగింది. వెయ్యిమైళ్ల ప్రయాణమైనా.. ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న అంబేద్కర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుంటూ.. ముందుడుగు వేస్తున్నాం. సంస్థ ఆరంభిస్తున్నట్లుగా తెలియజేయడంతో అనేక మంది మిత్రులు కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారు. ఈ రోజు నుంచి మా ప్రయాణం మొదలైంది. మేం ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటాం. దారి తప్పినట్లుగా భావిస్తే ప్రశ్నించే అధికారం మీకు ఇస్తున్నాం.. సమాధానం తెలియజేయడాన్ని బాధ్యతగా భావిస్తాం.
మేనేజింగ్ డైరెక్టర్ : పేరం గోపికృష్ణ
ఎడిటర్ : అరెల్లి కిరణ్ గౌడ్


